నటి కల్పికతో ఎఫైర్‌ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం

29 Oct, 2023 08:41 IST|Sakshi

నటి కల్పికా గణేష్‌ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏడాది క్రితం నటుడు అభినవ్‌ గోమటంపై ఆమె ఎన్నో ఆరపణలు చేసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సోషల్‌ వార్‌ నడిచింది.  అభినవ్ తనను వేధించాడని, తన పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడవలో చివరకు పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్పికా గణేష్‌ గురించి  అభినవ్‌ గోమటం పలు వ్యాఖ్యలు చేశాడు. కల్పిక తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని.. ఆమెతో ఎలాంటి ఎఫైర్ లేదని అభినవ్ స్పష్టం చేశాడు. ఆమెతో పెద్దగా పరిచయం కూడా లేదని ఆయన ఇలా చెప్పాడు. 'మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసేవాళ్లం. అది కూడా ఎప్పుడో ఓ ఆరు నెలలకు ఒకసారి. అయితే, గతేడాది నవంబర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. ఆ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదు.. కానీ నీకు రావడం చాలా గొప్ప విషయం అంటూ అభినందనలు అని రిప్లై ఇచ్చాను.

ఇక అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది. అవార్డు గురించి కూడా వినలేదు అంటావా..? నీకు అంత చులకనా? నీకు అంత ఇగోనా? అంటూ పెద్ద అగ్లీ ఫైట్‌ చేసింది. ఆ సమయంలో నేనొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకున్నాను. ఆమె నన్ను పురుషాహంకారి అదీ ఇదీ అంటూ మెసేజ్‌లు చేస్తోంది. దీంతో నేను రిప్లై ఇవ్వడం ఆపేశాను. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే. అందరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో తిట్టుకుంటోంది.

ఆ అవార్డు గురించి నాకు తెలియదు అన్న పాపానికి... ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అందులో తప్పేముందని చాలామంది నెటిజన్లు ఆమెను తప్పుపట్టారు. అవార్డు గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలని కూడా ఆమె మెసేజ్‌లు పెట్టింది. అప్పుడు జరిగిన విషయం ఇదే.. అంతే కానీ ఆమెతో ఎలాంటి లవ్వూ లేదు.. గివ్వూ లేదు. నేను ఎలాంటి ప్రేమ కావ్యాలు కూడా రాయలేదు. అని అభినవ్‌ చెప్పాడు. గతంలో కల్పిక చిత్రపరిశ్రమలోని చాలామంది నటీనటులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్‌లో నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు