భయం ఎందుకు?

19 Jan, 2021 06:24 IST|Sakshi

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్‌’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్‌ గ్రూప్‌ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్‌ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు అభిషేక్‌ అగర్వాల్‌. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు