అభిషేక్‌, కరిష్మా ఒకరినొకరు ఇష్టపడ్డారు, కానీ..

2 May, 2021 11:04 IST|Sakshi

ప్రేమ్‌ ఖైదీ

అన్నీ అనుకున్నట్టే జరిగితే కరిష్మా కపూర్‌ జీవితం ఇంకోలా ఉండేది. అభిషేక్‌ బచ్చన్‌ జత అయ్యేవాడు. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నిశ్చితార్థం జరిగింది! కానీ బ్రేక్‌ అయింది.. ఆ ఇద్దరి భవిష్యత్‌ పట్ల పెద్దవాళ్లకున్న అభద్రత అడ్డొచ్చి. దాంతో వాళ్లిద్దరూ తమ ప్రేమనూ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.. అసలా ప్రేమ్‌ కహానీ ఎక్కడ మొదలైంది?

తనతోపాటు అజయ్‌ దేవ్‌గన్‌ రవీనాతోనూ లవ్‌ గేమ్‌ ఆడుతున్నాడని తెలిసి సైలెంట్‌గా అతణ్ణించి తప్పుకొని దృష్టంతా కెరీర్‌ మీదే పెట్టింది కరిష్మా. ఆ సమయంలోనే రాజ్‌కపూర్‌ కూతురి కొడుకు నిఖిల్‌ నందా పెళ్లి నిశ్చయమైంది అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేత బచ్చన్‌తో. అప్పుడే కరిష్మా, అభిషేక్‌ల మధ్య స్నేహం కుదిరింది. శ్వేత, నిఖిల్‌ నందా పెళ్లి (1997)లో అభిషేక్, కరిష్మాల ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారింది. అప్పటికి బాలీవుడ్‌లో కరిష్మా పెద్ద స్టార్‌. అభిషేక్‌ ఇంకా  కెరీరే మొదలుపెట్టలేదు. దాంతో తమ ప్రేమ వ్యవహారం బయటపడకుండా రహస్యంగా ఉంచడం వాళ్లకు తేలికైంది. అలా మూడేళ్లు గడిచిపోయాయి.

రెఫ్యూజీ
అభిషేక్‌ బచ్చన్‌ సినీరంగ ప్రవేశానికి(2000) ముహూర్తం సిద్ధమైంది రెఫ్యూజీ సినిమాతో. అందులో కథానాయిక కరిష్మా కపూర్‌ చెల్లెలు కరీనా కపూర్‌. అప్పుడు కరిష్మా, అభిషేక్‌ ప్రేమ సంగతి బయటపడింది. ఇటు అభిషేక్‌ బచ్చన్, అటు కరీనా కెరీర్‌ మీదే దృష్టి పెట్టిన ఆ రెండు కుటుంబాలూ కరిష్మా, అభిషేక్‌ లవ్‌ గురించి వినీవిననట్టే ఊరుకున్నాయి.

60 వ బర్త్‌డే.. 
మరో రెండేళ్లు దాటాయి. కరిష్మా, అభిషేక్‌లకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు పెద్దలు. అమితాబ్‌ బచ్చన్‌ 60వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిపించారు. అంతా బాగుంది.. పెళ్లవడమే తరువాయి అనుకున్నారంతా. ఆ ప్రేమ పక్షులూ పెళ్లి తర్వాత కలసి ఉండే జీవితం గురించి కలలు కనడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ రెండు కుటుంబాలు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేశాయి. ఇరు వర్గాల అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా షాక్‌. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆరా తీయడానికి మీడియా చాలా ప్రయత్నించింది. రెండు వైపుల వాళ్లు వ్యూహాత్మక మౌనం వహించారు. కరిష్మా, అభిషేక్‌ కూడా ఏ రోజూ పెదవి విప్పలేదు. ఇప్పటికీ ఆ కారణం బయటకు రాలేదు. 

గుసగుసలు..
కరిష్మా, అభిషేక్‌ల నిశ్చితార్థం తర్వాత కొన్నాళ్లకు బచ్చన్‌ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పటికి అభిషేక్‌నూ సక్సెస్‌ వరించలేదు. ఇవన్నీ సింగిల్‌ పేరెంట్‌గా ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన కరిష్మా తల్లి బబితలో అభద్రతను కలిగించాయి. తనలా తన కూతురి పరిస్థితి కాకూడదనే భయంతో పెళ్లికి ముందే తండ్రి ఆస్తిలో నుంచి కొంత కొడుకు అభిషేక్‌ పేరు మీద రాయమని బబిత అమితాబ్‌ బచ్చన్‌ కోరిందని.. ఆమె అలా అడగడంతో జయ బచ్చన్‌ నొచ్చుకుందని.. తల్లి బాధపడ్డం అభిషేక్‌కు నచ్చలేదని.. అందుకే ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు. అంతేకాదు భవిష్యత్‌లో ఎప్పుడూ కరిష్మా వంక కన్నెత్తి చూడనని అభిషేక్‌ తన తల్లికి మాటిచ్చాడనీ ఆ వినికిడి. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ బ్రేక్‌ అయింది. 

తర్వాత.. 
కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లిచేసుకుంది. అది కలహాల కాపురంగానే ముగిసిపోయింది. ఇటు అభిషేక్‌.. రాణి ముఖర్జీ ప్రేమలో పడ్డాడు. పెళ్లిదాకా వెళతారనే అనుకున్నారంతా. కాని వెళ్లలేదు. కారణం.. జయ బచ్చన్‌. రాణీ ముఖర్జీ, జయ బచ్చన్‌ కలసి ‘లగా చునరీ మే దాగ్‌’ అనే సినిమాలో నటించారు. ఆ సెట్స్‌ మీద రాణీ, జయాకు గొడవ జరిగి రాణి కాస్త దురుసుగా మాట్లాడిందట. దాంతో జయ .. అభిషేక్‌తో రాణి సన్నిహితంగా మెలగడాన్ని ఇష్టపడలేదని.. అమ్మ అభీష్టాన్ని అభిషేక్‌ మన్నించక తప్పలేదని అందుకే రాణితోనూ బ్రేకప్‌ తప్పనిసరి అయిందని పేర్కొంటాయి  బాలీవుడ్‌ వర్గాలు. 

నిజానికి రాణి ముఖర్జీని బచ్చన్‌ కుటుంబం చాలా ఇష్టపడింది. ముఖ్యంగా జయ. కారణం రాణి కూడా తనలాగే బెంగాలీ కావడం. అదీగాక ఆ అమ్మాయికి సహనమూ ఎక్కువేనని, అభిషేక్‌కి పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అనీ ఆ కుటుంబం ఆ ఇద్దరి ప్రేమను మనసారా అంగీకరించింది. ‘లగా చునరీ మే దాగ్‌’ ఆ అనుబంధాన్ని తెంచేసి మాయని మచ్చలా మిగిలిపోయింది.
- ఎస్సార్‌

చదవండి: పెళ్లికి ముందు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ప్లే బాయ్‌!

మరిన్ని వార్తలు