ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు

29 Jan, 2021 16:17 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం "ఆచార్య". ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ ఉండబోతుందని రిపబ్లిక్‌ డే సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఆ మరుసటి రోజే టీజర్‌ డేట్‌ రివీల్‌ చేసింది. జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు టీజర్‌ విడుదల చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి అభిమానులు టీజర్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తీరా ఆ ఉత్కంఠకు తెరదించే సమయం ఆసన్నమైంది. ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి. ప్రజానాయకుడు ప్రజల మధ్యలో నుంచే పుడతాడన్నట్లుగా పిడికిలి బిగిస్తూ ఎర్ర కండువాను ఎగరేస్తూ జన ప్రవాహం మధ్యలో నుంచి కెరటంలా లేస్తున్నాడు మెగాస్టార్‌.  హీరో వరుణ్‌తేజ్‌ లీక్‌ చేసినట్లుగానే టీజర్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. 'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు' అని చెర్రీ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుండగా మెగాస్టార్‌ ఎంట్రీ ఇచ్చారు. 'పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో' అన్న చిరు డైలాగ్‌ కేక పుట్టిస్తోంది. టీజర్‌ రిలీజైందో లేదో క్షణాల్లోనే లక్షల వ్యూస్‌ సంపాదిస్తూ ట్రెండ్‌ అవుతోంది. (చదవండి: అందుకే బ్రేక్‌ తీసుకుంటున్నా: కపిల్‌ శర్మ)

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌, ఆయన తనయుడు రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించనుంది. కాగా ఆ మధ్య 'ఆచార్య' కథ నాదేనంటూ కన్నెగంటి అనిల్‌ కృష్ణ, రాజేశ్‌ మండూరి అనే రచయితలు ఆరోపణలు చేశారు. అందులో ఎటువంటి నిజం లేదని ఆచార్య చిత్రబృందం కొట్టిపారేస్తూ లేఖ విడుదల చేసింది. ఆచార్య కథ కాన్సెప్ట్‌ ఒరిజినల్‌గా కొరటాల శివ తయారు చేశారని చెప్తూ ఆయన మీద ఆరోపణలు చేయడం సరి కాదని పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: ఆచార్య: రామ్‌ చరణ్‌కు జోడీ కుదిరింది)

మరిన్ని వార్తలు