ATFPG: 'సినిమా రిలీజ్‌పై నిర్మాతలకు హక్కు ఉంటుంది'

24 Aug, 2021 08:23 IST|Sakshi

‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఓ సినిమాకు పునాది వేసి, ఆ సినిమాను నిర్మించే నిర్మాతకు తన సినిమాను ఎప్పుడు.. ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది’’ అని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (ఏటీఎఫ్‌పీజీ) ప్రతినిధులు సోమవారం ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇవ్వడంవల్ల థియేటర్ల మనుగడ కష్టమవుతుందంటూ తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌సీటీఏ) ఈ నెల 20న ఓ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆ సమావేశంలో ఓటీటీలో తమ సినిమాను విడుదల చేయాలనుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం అమోదయోగ్యం కాదని ఏటీఎఫ్‌పీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్‌ ఉన్న హీరోల వల్లే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని, ప్రత్యేకంగా ఒక హీరోని టార్గెట్‌ చేయడం అనేది ఇండస్ట్రీలోని స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తుందని కూడా ఏటీఎఫ్‌పీజీ పేర్కొంది.

ఏ నిర్మాత అయినా ప్రాథమికంగా థియేటర్స్‌లోనే సినిమాను విడుదల చేయాలనుకుంటాడని, మారిన పరిస్థితుల దృష్ట్యా తన పెట్టుబడిని రాబట్టుకునే క్రమంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్ముకునే ఆలోచన చేయవచ్చని ఏటీఎఫ్‌పీజీ అంటోంది. అలాగే డిమాండ్‌ ఉన్న సినిమాలపైనే ఎగ్జిబిటర్స్‌ ఆసక్తి చూపిస్తారు కానీ ఓ మాదిరి సినిమాలను పట్టించుకోరని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. 

చదవండి : ముచ్చటగా మూడోసారి!..బుట్టబొమ్మతో బన్నీ స్టెప్పులు
హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

మరిన్ని వార్తలు