Ankit Siwach: నా ఫ్రెండ్స్‌ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను

12 May, 2022 16:53 IST|Sakshi

ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నవరసాలు పలికించే నటీనటుల జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ పైకి కనిపించనీయకుండా ముఖానికి మేకప్‌తో, పెదాలపై చిరునవ్వుతో స్క్రీన్‌పై కనిపిస్తూ జనాలను అలరిస్తూ ఉంటారు. బుల్లితెర స్టార్‌ అంకిత్‌ సివాచ్‌ కూడా ఈ కోవకే చెందుతాడు. మోడలింగ్‌ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలిపాడు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన అంకిత్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో ఓ పక్క చదువుకుంటూనే కాల్‌ సెంటర్‌లో పనిచేసేవాడిని. మోడలింగ్‌ పూర్తి చేయడానికి రూ.60,000 అవసరమయ్యాయి. కానీ దీనికోసం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఎందుకంటే కేవలం నా ఇష్టంతో మోడలింగ్‌ను ఎంచుకున్నాను. నేను సంపాదించిన డబ్బులతోనే మోడలింగ్‌ పూర్తి చేయాలనుకున్నాను. అయితే వేసవిలో ఢిల్లీలో ఎండలు మండిపోతాయి. ఆ సమయంలో ఎండకు తాళలేక నేను ఏటీఎమ్‌ దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌కు ఓ వంద రూపాయలు ఇచ్చి అక్కడ పడుకునేవాడిని. ఎందుకంటే అందులో ఏసీ ఉంటుంది కదా!

అలా దాదాపు ఏడు వారాలపాటు ఏసీ కోసం ఏటీఎమ్‌లో నిద్రించేవాడిని. ఒకవేళ నాకు డబ్బు కావాలని పేరెంట్స్‌ను అడిగితే వాళ్లు  ఒక్క మాట కూడా తిరిగి ప్రశ్నించకుండా నాకు మనీ పంపించేవారు. కానీ నాకది ఇష్టం లేదు. పైగా డబ్బులు దుబారా ఖర్చు పెట్టకూడదని ఫ్రెండ్స్‌తో పార్టీలకు కూడా వెళ్లేవాడిని కాదు. అందువల్ల వాళ్లు నన్ను ద్వేషించేవారు కూడా! ఇంట్లో(మీరట్‌లో) ఉంటే హాయిగా బతికేవాడినే, కానీ ఇక్కడికొచ్చాక చాలా కష్టాలు పడ్డాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అంకిత్‌.. మన్మోహిని, యే జుకీసి నజర్‌, సఫర్నమ వంటి పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు.

చదవండి: సాక్షి ఆడియన్స్‌ పోల్‌, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ

బాలీవుడ్‌ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది

మరిన్ని వార్తలు