K Bhagya Raj: నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్‌ను నటీనటుల సంఘం నుంచి తొలగించిన నడిగర్‌ సంఘం

3 Oct, 2022 10:39 IST|Sakshi

నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) వేటు వేసింది. వివరాలు.. 2019లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నటుడు కె.భాగ్యరాజ్‌ అధ్యక్షతన శంకర్‌దాస్‌ పేరుతో ఓ జట్టు, నటుడు నాజర్‌ అధ్యక్షతన పాండవర్‌ జట్టు ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కౌంటింగ్‌ నిలిచిపోయింది. దీనిపై నాజర్‌ జట్టు రీ పిటీషన్‌ దాఖలు చేసింది.

చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ

సుదీర్ఘకాలం జరిగిన ఈ కేసు విచారణ అనంతరం న్యాయస్థానం సంఘం ఎన్నికలు సక్రమమేనని తీర్పు నిచ్చింది. దీంతో నాజర్‌ వర్గం కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కె.భాగ్యరాజ్, నటుడు ఏఎల్‌ ఉదయ్‌ను 6 నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు సంఘం కార్యవర్గం శనివారం ప్రకటించింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై నటుడు ఏఎల్‌ ఉదయ్‌ స్పందిస్తూ మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో వివరణ కోరుతూ మొదట నోటీసులు వచ్చినప్పుడే తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అలాంటిది తమిళ చిత్రంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన కె.భాగ్యరాజ్‌ను సంఘం నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. తనను, నటుడు బాబీని తొలగించడం కూడా పెద్ద విషయం కాదని, అయితే దర్శకుడు కె.భాగ్యరాజ్‌ను తొలగించడం చాలా విచారకరమని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో భాగ్యరాజ్‌ పోటీ చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: డైలాగ్స్‌ లేకుండా విజయ్‌ సేతుపతి ‘గాంధీ టాక్స్‌’, ఆసక్తిగా ఫస్ట్‌గ్లింప్స్‌

ఇలా ప్రశ్నించిన వారందరినీ సంఘం నుంచి తొలగించడం అన్నది సరైన విధానం కాదన్నారు. నటుడు శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు సభ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుత సంఘం నిర్వాహకులు ఆరంభం నుంచే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతకుముందు కూడా పలువురు నాటక కళాకారులను, ఇతర సభ్యులను సంఘం నుంచి తొలగించారని గుర్తు చేశారు. నూతన భవనం ఇప్పటికీ పూర్తి కాలేదని ఏఎల్‌ ఉదయ ఆరోపించారు.   

మరిన్ని వార్తలు