Fahadh Faasil: 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ గురించి ఇవి తెలుసా?

8 Aug, 2023 12:22 IST|Sakshi

ఓ నటుడు. తండ్రి డైరెక్టర్ కావడంతో ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. 19 ఏళ్లకే హీరోగా తొలి సినిమా. బ్యాడ్ లక్. మూవీ ఫ్లాప్ అయింది. దీనికి తోడు అదనంగా అవమానాలు, యాక్టింగ్ రాదని ఘోరమైన విమర్శలు. దెబ్బకు భయపడిపోయాడు. వల్ల కాదు బాబోయ్ అని దేశం వదిలేసిపోయాడు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ. సినిమా హిట్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతడే ఫహాద్ ఫాజిల్. మంగళవారం అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ.

హీరోలా ఉండడు
సినిమా హీరో అంటే ఫిట్‌గా ఉండాలి, అందంగా కనిపించాలి, అమ్మాయిలని ఆకట్టుకోవాలి.. ఇలాంటి కొలమానాలు బోలెడు. వాటన్నింటికీ ఫహాద్ ఫాజిల్ చాలా దూరం. చూడటానికి బక్కగా ఉంటాడు. బట్టతలతోనే కనిపిస్తాడు. ఓ సాదాసీదా మనిషిలా ఉంటాడు. ఇవన్నీ కాదు ఎవరికోసమే తన వ్యక్తిత్వాన‍్ని అస్సలు మార్చుకోడు. అందుకే ప్రేక్షకులు ఇతడిని అభిమానిస్తున్నారు, సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నారు.

(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

పనికిరాడన‍్నారు
తండ్రి ఫాజిల్ దర్శకత్వంలో 19 ఏళ్లకే 'కైయెతుమ్ దూరత్' సినిమాతో ఫహాద్ హీరో అయిపోయాడు. కానీ ఇది ఫెయిలవడంతో ఫహాద్‌ని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. నటుడిగా అస్సలు పనికిరాడని అవమానించారు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తనపై విమర్శలకు నటనతోనే సమాధానమిచ్చాడు.

హీరోయిన్‌తో పెళ్లి
రీఎంట్రీలో నటుడిగా ఫహాద్ ఫాజిల్ సక్సెస్‌లు అందుకున్నాడు. 'బెంగళూరు డేస్'లో తనకు భార్యగా నటించిన నజ్రియా నజీమ్‌ని చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. లవ్ లెటర్‌లో ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నజ్రియా.. కొన్నాళ్లు చుట్టూ తిప్పించుకుని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకే అంటే 2014 ఆగస్టు 21న వీళ్ల పెళ్లి జరిగిపోయింది. 

(ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?)

ఓటీటీల్లోకి ధైర్యంగా
లాక్‌డౌన్ టైంలో దాదాపు అందరూ హీరోలు షూటింగ్స్ చేయడానికే భయపడితే.. ఫహాద్ ఫాజిల్ మాత్రం వరసపెట్టి మూవీస్ చేశాడు. వాటిని ఓటీటీల్లో ధైర్యంగా రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఉపాధి కల్పించాడు. అదే టైంలో తెలుగు డబ్బింగ్ కూడా ఉండేసరికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. 'పుష్ప'లో షెఖావత్, 'విక్రమ్'లో అమర్‌గా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు.

కళ్లు చాలు
సాధారణంగా హీరోలంటే ఫైట్స్ చేయాలి, గడ్డం పెంచాలని అందరూ అంటుంటారు. ఫహాద్ ఫాజిల్ మాత్రం జస్ట్ కళ్లతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసేస్తుంటాడు. అతడి సినిమాలు చూసే ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. అలానే హీరో అనే కాకుండా విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ లాంటి రోల్స్ చేయడానికి అస్సలు మొహమాటపడడు. ఇకపోతే ఫహాద్ ఫాజిల్ మరెన్నో మంచి సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌తో విశాల్‌ పెళ్లి ఫిక్స్‌ !)

మరిన్ని వార్తలు