13 ఏళ్లకే హీరో.. ‘ఆ సినిమాల’తో నెగెటివ్‌ ఇమేజ్‌!! అయినా ఛాన్స్‌లు

14 Aug, 2021 11:13 IST|Sakshi

Actor Harish Kumar Special Story: ఒక యాక్టర్‌ ఎక్కువ కాలం కెరీర్‌లో కొనసాగాలంటే రకరకాల పరిస్థితులు అనుకూలించాలి. ఏదో ఒక కారణం వాళ్లను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ సొంత ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ద్వారా ఆ వ్యతిరేకతను అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండాలి. బాల నటుడిగా మొదలైన హరీష్‌ కుమార్‌ నటనా ప్రస్థానం.. అన్ని భాషల్లో అందగాడనే ‍ట్యాగ్‌తో హీరోగా రాణించగలిగే అవకాశాల్ని తెచ్చిపెట్టింది. కానీ, ఎందుకనో అది ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఈ విషయంలో చాలామంది పొరపడుతుంటారు కూడా.

హరీష్‌ కుమార్‌(46).. నాలుగు దశాబ్దల నటుడు. కెరీర్‌ మొదట్లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. అప్పట్లో ఇది ఒక రికార్డు కూడా. ఆపై హీరోగా కూడా ఇవే భాషల్లో రాణించాడు. సుమారు 280 సినిమాల్లో నటించిన హరీష్‌కు అభిమానుల్లో ‘హ్యాండ్సమ్‌ స్టార్‌’ ఒక ట్యాగ్‌లైన్‌ ఉండేది. అక్కినేని నాగేశ్వర రావు, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్‌ చక్రవర్తి, రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి, గోవిందా.. ఇలా దాదాపు అన్ని భాషల్లో టాప్‌హీరోలతో నటించిన ఘనత హరీష్‌కు ఉంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో తెరపై కనిపించడం తగ్గించేశాడు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నాడు.  1995లో సంగీతను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా!(ఆగష్టు 1 కాదు.. 14న ఆయన పుట్టినరోజు).

 

‘యంగ్‌’ హీరో రోల్స్‌లో.. 
హైద్రాబాద్‌లో పుట్టి, పెరిగిన హరీష్‌.. చిన్న వయసుకే నటనలోకి దిగాడు. ముద్దుల కొడుకు(1979) ద్వారా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై సీతామాలక్క్క్ష్మి, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం, నా దేశం, శ్రీమద్విరాట​ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తదితర సినిమాల్లో నటించాడు. హిందీలో ఎనిమిదేళ్లకే అడుగుపెట్టి, ఆపై తమిళ్‌ సినిమాల్లోనూ అగ్ర హీరోల యంగ్‌ వెర్షన్‌ రోల్స్‌లో సుమారు 20 చిత్రాల్లో మెప్పించాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతున్న టైంలో లీడ్‌ హీరోగా పెద్ద సక్సెస్‌ అందుకున్న ఘనత హరీష్‌ ఖాతాలో ఉంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఆంధ్ర కేసరి.. హరీష్‌కు తొలి నంది అవార్డు తెచ్చిపెట్టింది.
 
 

ఓ రేంజ్‌ హిట్‌.. 
హరీష్‌ హీరో అయ్యింది పదమూడేళ్లకే. మలయాళంలో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘డైసీ’ ద్వారా హీరో అయ్యాడు. స్కూల్‌ టీనేజ్‌ లవ్‌ స్టోరీతో నడిచే ఈ మూవీకి ప్రతాప్‌ పోతన్‌ డైరెక్టర్‌ కాగా, కమల్‌ హాసన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. ట్రాజెడీ కథగా 1988లో రిలీజ్‌ అయిన డైసీ భారీ హిట్‌ అయ్యింది. ఆపై హరీష్‌కు తమిళం, తెలుగు, హిందీలోనూ హీరోగా అవకాశాలు దక్కాయి.  

ఫ్యామిలీ హీరో
హీరోగా అవకాశాలు దక్కకముందు సపోర్టింగ్‌ రోల్స్‌తో అలరించాడు హరీష్‌. ఆపై ఈవీవీ-రామానాయుడు కాంబోలో వచ్చిన ‘ప్రేమ ఖైదీ’ ద్వారా సెన్సేషన్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అటుపై ‘పెళ్ళాం చెపితే వినాలి, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేత, ఏవండీ ఆవిడ వచ్చింది, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం, జైలర్‌గారి అబ్బాయి, ఎస్పీ పరుశరాం చిత్రాలతో ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ హీరోగా అలరించాడు.1996లో జంధ్యాల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఒహొ నా పెళ్ళంట’కు బెస్ట్‌యాక్టర్‌గా స్పెషల్‌ జ్యూరీ నంది అందుకున్నాడు.

ఆపై గోకులంలో సీత, డాడీ డాడీ తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్‌తో ఈవీవీ పెళ్లైంది కానీ(2007)లో నటించాడు. ఇక హిందీలో కరిష్మా కపూర్‌ ఫస్ట్‌ హీరో కూడా హరీషే. ప్రేమ ఖైదీ హిందీ రీమేక్‌లో హరీష్‌ సరసన నటించడం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది కరిష్మా. ఆపై హిందీలో(దాదాపు నలభై చిత్రాలు), మూడు తమిళ సినిమాలు, ఏడేనిమిది కన్నడ సినిమాలతో హరీష్‌ నటుడిగా, హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

ఇక బాలీవుడ్‌లో గోవిందాతో ప్రత్యేక అనుబంధం ఉంది హరీష్‌కు. అందుకే చాలా సినిమాల్లో తన పక్కన అవకాశం ఇచ్చాడు ఆయన. ఆపై చాలా గ్యాప్‌ తర్వాత హీరోగా చేసిన ‘ఆ గయా హీరో’(2018)లోనూ హరీష్‌కు ఓ రోల్‌ ఇప్పించాడు గోవిందా.

ఆ ఐదు సినిమాల వల్లే..
హీరోగా మిగతా భాషల్లో అవకాశాలు దక్కుతున్న టైంలో.. హరీష్‌ మీద ‘థర్డ్‌ గ్రేడ్‌’ అనే ట్యాగ్‌ ప్రచారంలోకి వచ్చింది. అందుకు కారణం మలయాళంలో డైసీ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ ఆ తరహా చిత్రాలే కావడం. రొమాంటిక్‌ కథల పేరుతో మలయాళంలో వరుసబెట్టి ఐదారు సినిమాల్లో నటించాడు హరీష్‌. ఇవే హరీష్‌పై నెగెటివ్‌ ముద్రను వేశాయి. అయితే ఆ టైంలో మీడియా ఫోకస్‌ ఎక్కువగా లేకపోవడం, ఉన్న మీడియా హౌజ్‌లు కూడా ఆ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేయలేదు. దీంతో హరీష్‌ కెరీర్‌ మసకబారడానికి ఆ సినిమాలే ఓ కారణంగా భావిస్తుంటారు చాలామంది. కానీ, ఈ సినిమాలు చేసినా కూడా..  హరీష్‌ బాలీవుడ్‌తో సహా మిగతా భాషల్లో హీరోగా రాణించాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు ఎందుకనో!.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు