Javed Haider: కూతురి స్కూలు ఫీజుకు కూడా డబ్బుల్లేవు

28 Jul, 2021 19:51 IST|Sakshi

Actor Javed Haider: కరోనా వల్ల అన్ని రంగాలు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లకు సడన్‌ బ్రేక్‌ పడటంతో చాలామంది నటీనటులు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు. మరికొందరు తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయా? ఎప్పుడు అవకాశాలిస్తారా? అని ఎదురు చూపులతోనే కాలం వెళ్లదీశారు. నటుడు జావేద్‌ హైదర్‌ కూడా ఈ కోవలోకే వస్తాడు. ప్రస్తుతం అతడు చేతిలో చిల్లిగవ్వ లేక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. కన్నకూతురిని చదివించలేని దయనీయస్థితిలో ఉన్నాడు.

తాజాగా జావేద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు. ఎనిమిదో తరగతి చదివే తన కూతురికి స్కూలు ఫీజు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నానన్నాడు. తన కూతురికి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయని, దీనికోసం నెలకు రూ.2,500 కట్టాల్సి ఉందన్న జావేద్‌ మూడు నెలలుగా ఫీజు చెల్లించకపోవడంతో ఆమెను ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని వాపోయాడు. అప్పుడు ఆమె స్కూలుకు వెళ్లి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదన్నాడు. ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చి ఫీజు చెల్లించిన తర్వాతే తన కూతురిని క్లాసులకు అనుమతించారని తెలిపాడు.

ఇక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను డబ్బు కోసం ప్రాధేయపడటం తనలాంటి వాళ్లకు సిగ్గుచేటుగా అనిపిస్తుందని జావేద్‌ చెప్పుకొచ్చాడు. ఒకసారి డబ్బు కోసం చేయి చాచారంటే వాళ్లను అందరూ చులకనగా చూస్తారని, ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఆర్థిక సాయం ఆశించినవారికి అవకాశాలివ్వడానికి అస్సలు ఇష్టపడరని చెప్పాడు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు స్నేహితులను అడగడమో లేదా భార్య నగలను, ఇంటిని తాకట్టు పెట్టడమో చేయక తప్పదని పేర్కొన్నాడు. కాగా జావేద్‌ హైదర్‌ 1973లో వచ్చిన యాడోన్‌ కీ బారత్‌ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించాడు. అనంతరం ఎన్నో బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించాడు.

మరిన్ని వార్తలు