'మద్రాసులో ఏ మూలకైనా సరే సైకిల్‌ మీదే వెళ్లేవారు'

29 Aug, 2021 10:15 IST|Sakshi

ఇంద్రుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, జనకుడు, దశరథుడు వంటి పౌరాణిక పాత్రలు..
అనేక జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో తెలుగు తెరను సుసంపన్నం చేశారు..
తెలంగాణ సాయుధ పోరాటం కోసం మా భూమి నాటకాన్ని ప్రదర్శించారు..
సాధారణ జీవితం గడుపుతూ, వెండితెర మీద వెలుగులు చిందించారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి..
సైకిల్‌ మీదే తన ప్రయాణాన్ని ప్రారంభించిన తండ్రి గురించి కుమారుడు విజయ్‌ కుమార్‌ పంచుకున్న అనుబంధ ప్రయాణం..

నాన్నగారు కృష్ణాష్టమి రోజున, కృష్ణా తీరంలో మేనమామ ఇంట్లో పుట్టడం వల్ల రాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టారు. కోలవెన్ను స్వగ్రామం. వెంకయ్య, సౌభాగ్యమ్మ దంపతులకు నాన్న రెండో సంతానం. పెద్దాయన బలరామకృష్ణయ్య. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు పేరయ్య, రామమోహన్‌రావు, ఇద్దరు చెల్లెళ్లు లక్ష్మి, సరస్వతి. నాన్నకు ముగ్గురు పిల్లలం. అక్క మాలతి, చెల్లి రేణుక, నేను. నాన్న ఆ రోజుల్లో ప్రజానాట్యమండలి తరఫున తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ‘మా భూమి’ నాటకంలో నాన్నతో పాటు నటించిన సీతారత్నమ్మను ప్రేమవివాహం చేసుకున్నారు.

కమ్యూనిస్టు పార్టీలో నాలుగైదు సార్లు జైలుకి కూడా వెళ్లారు. నాన్న పునాదిపాడులో చదువుకునే రోజుల్లోనే పాటలు, పద్యాలు పాడుకుంటూ చదువును నిర్లక్ష్యం చేశారంటారు. కోలవెన్ను లైబ్రరీలో ఉద్యోగం చేసే రోజుల్లో పుస్తకాలు చదవటం వల్ల మంచి భాష అలవడింది. చాలా బాగా రాసేవారు. ఆయనతో అరవై సంవత్సరాలు గడిపినా మాకు అబ్బలేదు. 

రూపాయి టికెట్‌తో...
నాన్న ‘గాలి మేడలు’ నాటకం ప్రదర్శించారు. టికెట్‌ వెల రూపాయి. నాన్నే విశాలాంధ్రలో పోస్టర్లు వేయించి, లైట్‌ స్తంభాలకు అంటించారు. థియేటర్‌ అంతా శుభ్రం చేసి, కుర్చీలు నాన్నే వేశారు. ఆ రోజుల్లో ఆ నాటకం హౌస్‌ఫుల్‌. విజయవాడ రామా టాకీస్‌లో ‘మా భూమి’ నాటకాన్ని రెండు షోలు అర్ధరాత్రి వరకు వేశారు. ఇంటికి సుమారు 40 రూపాయలు వచ్చేవి. ఆకాశవాణిలో వేసే నాటకాలకు 20 రూపాయలు వచ్చేవి. మాకు కొద్దిగా పొలం ఉంది. అందువల్ల ఏ ఇబ్బందులూ లేకుండా కుటుంబం నడిచిపోయేది. 

మంచి స్నేహితులు..
అప్పటికే మంచి నిర్మాతగా పేరున్న కె.ఎస్‌. ప్రకాశరావుగారు, నాన్న మంచి స్నేహితులు. ఆయనతో పాటు, పోతిన బెనర్జీ, వీరమాచనేని సంతాన గోపాలరావుల ప్రోత్సహంతో నాన్న చెన్నై చేరుకున్నారు. చిన్న వేషం వేసినా, పెద్ద వేషం వేసినా అందరితో చాలా మంచిగా ఉండేవారు. నాన్న అందం, పొడవు చూసి కొత్త నటులకు ఇబ్బందిగా ఉండేది. ఈయన వస్తే ఎలా ఉంటుందోనని బాగా దూరం పెట్టారు. 

సైకిల్‌ మీదే...
మద్రాసులో ఏ మూలకైనా సరే నాన్న సైకిల్‌ మీదే వెళ్లేవారు. ఆ సైకిల్‌ నాన్నకు చాలా రకాలుగా ఉపయోగపడింది. ఇంటికి రాగానే సైకిల్‌ని లోపల దాచేసేవాడిని. నిరంతరం ఆ సైకిల్‌కి నేను కాపలా ఉండేవాడిని. నాన్న చాలా సింపుల్‌గా ఉండేవారు. పైజమా, లాల్చీ ధరించేవారు. దూరం నుంచి నాన్నను చూసి మిక్కిలినేని బ్రాండ్‌ అనుకునేవారు. విలన్‌గా స్థిరపడదామని, స్టంట్‌ మాస్టర్‌ని పెట్టుకుని కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. కాని సాత్విక పాత్రలకు నిలబడిపోయారు. నాన్నగారి కారు ఆయనే తుడుచుకునేవారు.

సాధారణంగా ఉండేవారు..
నాన్న చాలా మితంగా మాట్లాడేవారు. ఆయన భోజన ప్రియులే కానీ, భోజనం చాలా క్లుప్తంగా ఉండేది.  సినిమా మోజుతో పాటు, నాన్నను చూడటానికి చాలామంది వచ్చేవారు. మోసపోయిన ఆడవాళ్లు, బ్యాగులు పోగొట్టుకున్న వారికి అన్నం పెట్టి, సురక్షితంగా వారివారి ఇళ్లకు పంపేవారు. నేనే రైల్వేస్టేషన్‌కి తీసుకువెళ్లి, టికెట్‌ కొని, ఎక్కించి రావాలి. ఎవరైనా ఉండిపోతామంటే, వాళ్లవాళ్లకి ఉత్తరం రాసి, వాళ్లు స్థిరపడేవరకు సహకరించేవారు. ఫ్యాన్‌ మెయిల్‌ వస్తే, అక్షరాలు పోకుండా ఉండేలా, జాగ్రత్తగా కత్తెరతో కట్‌ చేసేవారు. వాటికి సమాధానాలు స్వయంగా రాసి ఇస్తే, నేను డబ్బాలో వేసేవాడిని. 

ఇష్ట చతుష్టయం..
పద్మనాభం, ఎస్‌. పి. కోదండపాణి, నాన్న, నేను బ్యాడ్మింటన్‌ ఆడేవాళ్లం. నాన్న స్విమింగ్‌కి వెళ్లేవారు. సినారె సినీ పరిశ్రమకు వచ్చిన తరవాత, ఇంచుమించు ప్రతి శుక్రవారం సాయంత్రానికి ఆయన మా ఇంటికి వచ్చేవారు. నాన్న, సి. నారాయణరెడ్డిగారు, నేరెళ్ల వేణుమాధవ్‌గారు, గుమ్మడి గారు నలుగురూ చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల నలుగురి స్నేహం చూసి అందరూ ముచ్చటపడేవారు. సి. నారాయణరెడ్డిగారు వారి నలుగురి స్నేహానికి ‘ఇష్ట చతుష్టయం’ అని పేరు స్థిరపరిచారు. నాన్నని సినారె అగ్రజా అంటే, నేరెళ్ల సినారెను అగ్రజా అనేవారు. 

తగ్గించుకున్నారు..
నాన్న 1998లో విజయవాడ వచ్చేశారు. నాన్నకు సన్మానం జరగని ఊరే లేదు. ఒకసారి విజయదశమి నాడు మండపేటలో దేవాలయానికి వెళ్లివచ్చారు. పండుగ పూట నగలు తీయటం ఎందుకని, అమ్మ, చెల్లాయిలు నగలు ఉంచుకునే పడుకున్నారు. తెల్లవారేసరికి మొత్తం దొంగతనం చేసేశారు. ఇక అప్పుడు నాన్నను ప్రయాణాలు తగ్గించుకోమన్నాను. నగలు పరవాలే, ఎవరైనా అఘాయిత్యం చేస్తే కష్టం కదా అనే ఆలోచనతో. నాన్న తన 95 ఏట కన్ను మూశారు. అమ్మనాన్నలు కాలం చేసేవరకు దగ్గరుండి చూసుకోగలిగాను. నాకు ఎనిమిది పదులు నిండినా ఇంకా నాకు ఆయన జ్ఞాపకాలు మదిలో మెదలాడుతూనే ఉంటాయి. నా భార్య ప్రజాకవి కోగంటి గోపాలకృష్ణ గారి కుమార్తె సరళ. మా నాన్నగారి బాటలోనే నడుస్తున్నారు నా ఇద్దరు ఆడపిల్లలు అనుపమ, అనూరాధ.

బాధ్యత అనుకున్నాను
మధ్యాహ్నం భోజనం చేశాక మడత మంచం మీద పడుకుని, కాళ్లు నొక్కమనేవారు. చేతులు నొప్పిగా ఉన్నాయని చెబితే, ఎక్కి తొక్కమని, తొక్కించుకునేవారు. అదొక ఆనందం. ఆయన నిద్ర పోతున్నప్పుడు ఇత్తడి బిందె మీద మూత తీసినా ‘ఊ...’ అని గంభీరంగా అనేవారు. అందుకని మాకు దాహం వేసినా మంచినీళ్లు తాగేవాళ్లం కాదు. ఎప్పుడైనా అమ్మకి అలసటగా ఉండి పడుకుంటే, నేను మెలకువగా ఉండి, వడ్డించేవాడిని. ఆ తరవాత చదువుకునేవాడిని. అది నా బాధ్యత అనుకునేవాడిని. 
– మిక్కిలినేని విజయ్‌కుమార్‌ (మిక్కిలినేని కుమారుడు)

సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు