Prakash Raj: అదో చెత్త సినిమా.. ఆస్కార్ కాదు కదా.. భాస్కర్ కూడా రాదు: ప్రకాశ్ రాజ్

8 Feb, 2023 16:42 IST|Sakshi

వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్‌ రాజ్‌.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు.

కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రకాశ్ రాజ్.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విమర్శలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్‌ ఓ నాన్సెన్స్ ఫిల్మ్‌ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కేవలం మొరగడానికే పనికొస్తారుగానీ.. కాటువేసే దమ్ము వీరికి లేదన్నారు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ఆయన మాట్లాడారు. 

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ' ది కశ్మీర్‌ ఫైల్స్‌ నాన్‌సెన్స్‌ చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఎలాంటి సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. వారు చేసేది కేవలం సౌండ్ పొల్యూషన్. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. అందుకే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ.2 వేల కోట్లు  ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు' అని అన్నారు. 

కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది  కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 1990లలో కాశ్మీరీ హిందువుల వలసలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. 

మరిన్ని వార్తలు