హీరో మాధవన్‌ తనయుడు వేదాంత్‌ అరుదైన ఘనత, 7 జాతీయ పథకాలు

25 Oct, 2021 19:27 IST|Sakshi

హీరో మాధవన్ కుమారుడు వేదాంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్‌. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్‌ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వీ ఓ ట్వీట్‌ చేశారు.

చదవండి: యూట్యూబ్‌ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు..

మాధవన్‌, వేదాంత్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘గుడ్‌ జాబ్‌ వేదాంత్‌. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో వేదాంత్‌ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్‌ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే,  4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. 

చదవండి: భార్యకు కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు

ఇదిలా ఉంటే వేదాంత్‌ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్‌లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు