Parampara 2: ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్‌ కుమార్‌

21 Jul, 2022 15:55 IST|Sakshi

‘థియేటర్ లకు జనాలను రప్పించాలంటే ఇప్పుడు శ్రమ పడాల్సి వస్తోంది. పాన్ ఇండియా ఆర్టిస్టులను పెడుతున్నారు. అలాగే మంచి ప్రమోషన్ చేయాలి. కానీ ఓటీటీ అలా కాదు. కొంత ప్రమోషన్ చేసి మంచి కంటెంట్ చూపిస్తే...ఆడియెన్స్ ఇంట్లోనే కూర్చొని చూస్తారు’అని ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ అన్నారు. ఆయన నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పరంపర’ సీజన్‌2. గతేడాది డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీక్వెల్‌ ఇది. ఈ వెబ్ సిరీస్ లో శరత్‌ కుమార్‌తో పాటు జగపతిబాబు, శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు.. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు.నేటి(జులై 21)ఈ కొత్త డిరీస్‌ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు శరత్‌ కుమార్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... 
  
నా కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్  తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలనీతో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. నాకు నచ్చని మోహన్ రావు అనే వ్యక్తి కొడుకు వచ్చి ఎదిరించినప్పుడు మా మధ్య అసలైన గొడవ మొదలవుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో నాయుడు అనే పాత్రలో నటిస్తున్నాను. మోహన్ రావు (జగపతిబాబు) కొడుకు గోపి(నవీన్ చంద్ర) నాయుడును ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందని అనేది ఈ సెకండ్ సీజన్ లో చూస్తారు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో  సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతూ ఉంటుంది.


పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం నాలుగేళ్లు గెడ్డం లుక్ అలాగే ఉంచుకోవాల్సివచ్చింది. అదే గెటప్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించాను. ఈ టీమ్ అందరితో పనిచేయడం సంతోషంగా ఉంది. దర్శకులు విజయ్, విశ్వనాథ్, హరి, కెమెరా మెన్ ..ఇలా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. నేనూ కంఫర్ట్ గా ఫీలయ్యాను. ఆర్టిస్టులు కూడా ఆమని, జగపతిబాబు, ఆకాంక్ష, నవీన్ చంద్ర ..బాగా నటించారు. కంటెంట్ బాగుంది కాబట్టి అంతా ఆకట్టుకునేలా నటించారు.

► కథ, మా క్యారెక్టరైజేషన్స్  ముందే డిజైన్ చేసి ఉంచారు కాబట్టి దర్శకులు ఎంతమంది అయినా నటించేప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే చేసుకుంటూ వెళ్లాం. టీమ్ అంతా పూర్తి కోఆర్డినేషన్ తో పనిచేసింది.

► థియేటర్ లో రెస్పాన్స్ సులువుగా  తెలిసిపోతుంది. సినిమా బాగుందా బాగా లేదా అని కలెక్షన్స్ చెబుతాయి. ఓటీటీలో కంటెంట్ బాగుందంటే మీడియా స్పందనను బట్టే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా బాగుందా బాగా లేదా అని చెబుతుంటాయి.

 గతంలో సీనియర్ నటులు పాత్రలను అర్థం  చేసుకుని, దర్శకులు చెప్పినదాన్ని బట్టి నటించేవారు. ఇవాళ మాలాంటి నటులకు ఎన్నో రిఫరెన్స్ లు తీసుకునే అవకాశం, ప్రపంచ సినిమాను చూసి స్ఫూర్తి పొందే వీలు ఉంది. గతంలో అలా లేదు.

 మనకున్న బడ్జెట్ పరిమితుల్లో మంచి కథను చెబితే వెబ్ సిరీస్ లు కూడా మంచి ప్రాఫిట్ వస్తాయి. ఘన విజయాలు సాధిస్తాయి. అందులో ప్రజలకు ఏదో ఒక మంచిని చెప్పాలనే ప్రయత్నమూ మన కథలు, పాత్రల ద్వారా  చేయవచ్చు. పరంపర 2 లో నా పాత్రకు మంచి డైలాగ్స్ ఉంటాయి. పర్మార్మెన్స్ కు అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది అనిపిస్తోంది.

ఇప్పుడు సినిమాల్లో విలన్ అంటే అర్థం మారిపోయింది. చూపించే విధానం ఛేంజ్ అయ్యింది. నా దృష్టిలో మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అనేది వాళ్ల ఆలోచించే కోణంలో ఉంటుంది. ఎవరికి వారే మేము హీరోనే అనుకుంటారు. ఇంట్లో వాళ్లను దూషించినప్పుడు మాత్రమే నాకు బాగా కోపమొస్తుంది.

ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న వారుసుడు సినిమాలో నటిస్తున్నాను. పొన్నియన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే లారెన్స్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను.

మరిన్ని వార్తలు