Ponniyin Selvan: ఐశ్వర్యరాయ్‌ పాత్రపై శరత్‌ కుమార్‌ కామెంట్స్‌

29 Sep, 2022 07:03 IST|Sakshi

శరత్‌కుమార్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రముఖ నటుడు, అఖిల భారత సమత్తువ పార్టీ అధ్యక్షుడు. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు అన్ని రకాల పాత్రలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు అని చెప్పవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థ నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఇందులో నటుడు శరత్‌కుమార్‌ పెరియపళవేట్టరైయర్‌ పాత్రలో నటించారు.

ఈ చిత్రం తొలి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు శరత్‌కుమార్‌ బుధవారం ఉదయం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. చోళరాజుల ఇతివృత్తంతో కూడిన పొన్నియిన్‌ సెల్వన్‌ చరిత్ర తెలిసిన నవల అన్నారు. దీన్ని సంపూర్ణంగా తెరకెక్కించాలంటే 10 భాగాలకు పైగా పడుతుందన్నారు. అయితే మణిరత్నం ప్రధాన పాత్రలను, ప్రధాన అంశాలను మిస్‌ కాకుండా తాను అనుకున్న విధంగా అద్భుతంగా మలిచారన్నారు. దీనికి లైకా సంస్థ ప్రయత్నం చాలా ఉందన్నారు.

అసాధారణమైన ఈ చిత్రాన్ని మణిరత్నం తన ప్రయత్నంతో సుసాధ్యం చేశారన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో సుందర్‌ చోళన్‌ రాజుకు మిత్రుడు పెరియ పళవేట్టరైయర్‌ పాత్రలో నటించానని తెలిపారు. ఇది చోళరాజ్యానికి సంరక్షణకు భద్రుడు పాత్ర అన్నారు. నందిని అనే కపటధారిణి  పాత్రలో ఐశ్వర్యారాయ్‌ నటించారు. ఇందులో తన అందానికి వశం కావడం, ఆమెను వివాహమాడటంతో జరిగే పరిణామాలు చిత్రంలో చూడాలన్నారు. చోళరాజుల చరిత్ర తెలియని వారికి ఈ చిత్రం పలు విషయాలను తెలియజేస్తుందన్నారు. తంజావూరులో ప్రసిద్ధి గాంచిన పెరియ కోవిల్‌ (ఆలయం) చోళరాజు నిర్మించిన విషయం తెలిసిందే.

నున్నారు సముద్రాలను దాటి రాజ్యాలను గెలిచిన చోళ సామ్రాజ్యం కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ అన్నారు. ప్రస్తుతం తాను పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా ఇది సెకెండ్‌ ఇన్నింగ్స్‌? అని అడుగుతున్నారని, అయితే తాను తొలి ఇన్నింగ్సే పూర్తి కాలేదని అన్నారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రాజకీయ పార్టీ పరమైన పనులకు ఆటంకం కలగడం లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లోనే నడుస్తున్నాయని అన్నారు. తన కార్యకర్తలతో జూమ్‌ మీటింగ్‌లతో టచ్‌లోనే ఉంటున్నానని, ప్రజా వ్యతిరేక విధానాలను తన గొంతు వినిపిస్తునే ఉంటున్నదని శరత్‌కుమార్‌ చెప్పారు.     

మరిన్ని వార్తలు