సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. ఒకవేళ

16 Sep, 2020 17:47 IST|Sakshi

చాలా మంది దగ్గర కంచం కూడా ఉండదు

పేమెంట్లు ఆలస్యమైతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు

నటుడు దీపక్‌ ఖజీర్‌ వ్యాఖ్యలు

‘‘నాలుగేళ్ల నుంచి సుశాంత్‌తో టచ్‌లో లేను. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను నమ్మను. తనది ముమ్మాటికి హత్యే అనిపిస్తోంది’’ అంటూ టీవీ నటుడు దీపక్‌ ఖజీర్‌ తన మనసులోని భావాలు వెల్లడించాడు. రాయడం అంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టమని, ఒకవేళ తను నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే సూసైడ్‌ నోట్‌ ఎందుకు రాయలేదని అనుమానం వ్యక్తం చేశారు. మీడియా కథనాల ఆధారంగా ఈ విషయంలో అందరి అభిప్రాయాలు మారుతున్నాయని, అయితే సీబీఐ విచారణ పూర్తై, సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలిస్తే తన అభిప్రాయంలో మార్పు ఉండవచ‍్చన్నారు. కాగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి, అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14 తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించి విషయం విదితమే. (చదవండి: డ్రగ్స్‌ కేసు: తల్లి ఫోన్‌ వాడిన రియా!)

ఈ క్రమంలో అతడి మృతి అనేక సందేహాలు, ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అంతేగాక సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్లు బహిర్గతం కావడంతో డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిన పవిత్ర రిష్తా సీరియల్‌లో అతడితో కలిసి నటించిన దీపక్‌ ఖజీర్‌ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ పవిత్ర రిష్తా సీరియల్‌ తర్వాత మళ్లీ తనను ఎన్నడూ కలవలేదు. అయితే నాలుగైదేళ్లలో ఓ వ్యక్తి పూర్తిగా మారిపోతాడని నేను అనుకోను. సుశాంత్‌కు ప్రతీ విషయం పేపర్‌పై పెట్టడం అలవాటు. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే నోట్‌ రాసేవాడు కదా. (చదవండి: ‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’)

అంతేకాదు అయినా ఎలాంటి ఆధారాలు లభించకుండానే సుశాంత్‌ది సూసైడ్‌ అని ముంబై పోలీసులు ఎలా తేలుస్తారు? సుశాంత్‌ కుటుంబం ఇప్పటికే శోక సంద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసే సమయంలో మరాఠీలో రాశారని వార్తలు వచ్చాయి. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ’’అని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్‌ వ్యవహారం నేపథ్యంలో నటి, ఎంపీ జయా బచ్చన్‌ చేసిన వ్యాఖ్యలను దీపక్‌ విమర్శించారు. ‘‘ఆమె అన్నట్లు ఇక్కడ చాలా మంది దగ్గర కనీసం కంచం కూడా లేదు.

ఓ చిన్న గిన్నె పట్టుకుని పేమెంట్ల కోసం ఎదురుచూస్తారు. ఆలస్యమైతే ఆర్థిక బాధలు భరించలేక జీవితాలను అంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి’’అని సినీ నటుల పరిస్థితిని వివరించారు. అయితే సుశాంత్‌కు ఇలాంటి కష్టాలేమీ లేవని, అతడు ఆర్థికంగా బలంగా ఉండటం సహా చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు తీసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. తనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా