Siva Balaji- Madhumitha: ఆ ఒక్క మెసేజ్‌తో మా పిల్లల్ని స్కూల్‌ నుంచి తీసేశారు

18 May, 2023 21:31 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శివబాలాజీ. ఇది మా అశోగ్గాడి లవ్‌ స్టోరీతో వెండితెరకు పరిచయమయ్యాడు శివబాలాజీ. తండ్రి వ్యాపారవేత్త అయినా శివబాలాజీ మాత్రం నటన అంటే ఆసక్తి ఉండటంతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తక్కువ కాలంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. చందమామ, శంభో శివ శంభో, ఆర్య వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల తన భార్య మధుమితతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైన శివబాలాజీ తన కష్టనష్టాలను చెప్పుకొచ్చాడు.

'నాన్న చనిపోయాక తన బిజినెస్‌ చూసుకునేవాళ్లు ఎవరూ లేరు. అమ్మకు ఏం తెలియదు, తమ్ముడు ఇంకా చిన్నవాడు. నెమ్మదిగా బిజినెస్‌ డౌన్‌ అవటం, బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు వడ్డీ పెరగడం మొదలైంది. అప్పుడు నేనే వెళ్లి మిషనరీలు, ఉన్న స్థలాలు.. ఇలా కొన్ని ఆస్తులమ్మేసి ఆ డబ్బుతో అప్పు కట్టేశాను. ఆ తర్వాత నేను కూడా బిజినెస్‌ చేసి చాలా మోసపోయాను. ఈము పక్షులు పెంపకం గురించి విని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందని తెలిసి వాటిని పెంచాం. 1500 పక్షులను పెంచాను. కేవలం వాటి తిండికే నెలకు రూ.5 లక్షల దాకా అయ్యేది. ఆ తర్వాత అదంతా స్కామ్‌ అని తెలిసింది. సబ్బులు, పెయిన్‌ రిలీఫ్‌ ఆయిల్‌.. ఇలా అన్నీ చేశాం. కానీ ఆ స్టాక్‌ అమ్ముడుపోక మిగిలిపోయేవి. దీంతో ఆ వ్యాపారమూ మూసేశాం. స్నేహమేరా జీవితం సినిమా కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టి అక్కడా నష్టపోయాను' అని చెప్పుకొచ్చాడు శివ బాలాజీ

పిల్లలను స్కూల్‌ మాన్పించేసిన ఘటన గురించి మధుమిత మాట్లాడుతూ.. 'కోవిడ్‌ సమయంలో స్కూలు ఫీజులు ఎంతమేరకు ఉండాలనేది ఒక జీవో వచ్చింది. మా పిల్లల స్కూల్‌లో అంతకంటే ఎక్కువ ఫీజు ఉంది. అప్పటికే ఆ స్కూల్‌లోని విద్యార్థుల పేరెంట్స్‌ గేటు బయట ధర్నా చేద్దామంటూ వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టారు. కోవిడ్‌ సమయంలో ధర్నా వద్దు, స్కూల్‌ యాజమాన్యంతోనే మీరొకసారి మళ్లీ మాట్లాడితే సరిపోతుంది అని ఒక మెసేజ్‌ పెట్టాను. నా మాట విని వాళ్లంతా ధర్నా ఆపేశారు. అయితే రేప్పొద్దున నేనేది చెప్పినా అంతా వింటారని అనుకున్నారో ఏమో కానీ స్కూల్‌ యాజమాన్యం మా పిల్లలను తీసేసింది. వారం రోజుల్లో పరీక్ష ఉండగా ఒక్క మాట కూడా చెప్పకుండా తీసేశారు. అప్పటికీ మేము ఫీజంతా కట్టేశాం. అయినా మేం ఏ తప్పూ చేయకపోయినా అలా ప్రవర్తించారు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్‌.. అప్పటి క్షణాలను తలుచుకుంటూ..

మరిన్ని వార్తలు