‘సాఫ్ట్‌వేర్‌ శారద’ కథనంపై స్పందించిన సోనూ సూద్‌

26 Jul, 2020 20:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూ సూద్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ శారదకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి టీవీ కథనానికి స్పందించిన సోనూ సూద్ సాఫ్ట్‌వేర్ ఆమె ఫోన్ నంబర్ అడిగి తెలుసుకున్నారు. శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీనిచ్చారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన యువ సాఫ్ట్‌వేర్‌ శారద తల్లిదండ్రులకు సాయంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో యువ సాఫ్ట్‌వేర్‌ జీవిత గమనంపై ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో వైరల్‌ అయింది.
(చదవండి: రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ అందించిన సోనూసూద్‌)

జీవితంలో ఆటుపోట్లు సహజమని, ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడొద్దని శారద యువతకు సందేశమిచ్చారు. బతికేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని, సమస్యలకు ఎదురొడ్డి పోరాడాలని చెప్పారు. ఇక శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఉపరాష్ట్రపతి కార్యాలయం, తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. ప్రభుత్వ పరంగా శారద కుంటుంబాన్ని ఆదుకుంటామని వరంగల్‌ ఎంపీ దయాకర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలాఉండగా.. కటిక దారిద్ర్యంలో ఉన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు కూడా తాజాగా సోనూ సూద్‌ ముందుకొచ్చారు. ఎద్దులు లేక ఇబ్బంది పడుతున్న రైతుకు ఏకంగా ట్రాక్టర్‌నే అందించారు.
(‘సాఫ్ట్‌వేర్‌ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ)

మరిన్ని వార్తలు