రైతులు తల్లిదండ్రులతో సమానం: సోనుసూద్‌

6 Dec, 2020 13:37 IST|Sakshi

ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. మరి కొంతమంది షాహిన్‌బాగ్‌ తరహా నిరసనలతో పోల్చడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్ల చేత తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ నటుడు సోన్‌సూద్‌ రైతులు చేస్తున్న నిరసనలపై స్పందించారు. ఆయన రైతుల గొప్పతనాన్ని​ తెలియజేసేలా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని రైతులు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికంటే ముందు కూడా సోన్‌సూద్‌ ‘భారతదేశం రైతు దేశం’ అని ట్వీట్‌ చేశారు. చదవండి: రైతు దీక్షలు.. సింగర్‌ కోటి సాయం

ఇక శనివారం కేంద్రంతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. కేంద్రంతో జరిగిన చర్చలో రైతు సంఘాలు వ్యవసాయ చట్టాల రద్దును తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర డిసెంబర్‌ 9 వరకు సమయాన్ని కోరింది. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియలో తీవ్ర దుమారం రేపాయి. కంగనా వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు త్రీవంగా ఖండించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు