Actor Srikanth: వారసుడులో నా పాత్ర ఇదే.. సంక్రాంతికి పండగ లాంటి చిత్రమిది: శ్రీకాంత్‌

4 Jan, 2023 08:49 IST|Sakshi

‘‘నా కెరీర్‌లో తొలి తమిళ చిత్రం ‘వారసుడు’. ఇందులో విజయ్‌కి బ్రదర్‌గా కీలకమైన పాత్ర చేశాను. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. దళపతి విజయ్, రష్మికా  మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్‌’ రాజు, శిరీష్, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శ్రీకాంత్‌ చెప్పిన విశేషాలు.

⇔ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేసినప్పటికీ పక్కా తెలుగు మూవీలానే ఉంటుంది. జయసుధగారు, నేను, కిక్‌ శ్యామ్, శరత్‌ కుమార్, రష్మిక, సంగీత, ప్రభు.. ఇలా అందరూ తెలుగు సినిమాలు చేసిన వారే ఉండటంతో పూర్తి తెలుగు నేటివిటీ సినిమాలానే ఉంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. ఆ కోవలోనే ఈ మూవీలో బ్రదర్స్‌ మధ్య జరిగే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. విజయ్‌గారు ఎక్కువగా మాట్లాడరు. సెట్‌లో అడుగు పెడితే ప్యాకప్‌ చెప్పేవరకూ అక్కడే ఉంటారు. క్యార్‌వాన్‌ వాడరు.. సెల్‌ ఫోన్‌ కూడా దగ్గర పెట్టుకోరు. ఒక మంచి సినిమా, విజయ్‌లాంటి స్టార్‌ హీరోతో తమిళంలో అడుగుపెడుతుండటం హ్యాపీ. 

⇔ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్‌  ఇండియా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోనూ హిట్‌ సాధిస్తున్నాయి. సంక్రాంతి అనేది సినిమాల పండగ కూడా.. అన్ని సినిమాలనీ ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘వారసుడు’ పండగ లాంటి సినిమా. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. అదే హ్యాపీ సంక్రాంతి. ‘దిల్‌’ రాజుగారి ప్రొడక్షన్‌లో చేయడం ఇదే తొలిసారి. ‘వారసుడు’కి తమన్‌ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్‌ ఇచ్చాడు. 

⇔ ‘అఖండ’ తర్వాత డిఫరెంట్‌గా ఉండాలని ‘వారసుడు’లోని పాత్ర చేశాను. అలాగే రామ్‌చరణ్‌– శంకర్‌గారి సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నాను. కథ, క్యారెక్టర్‌ నచ్చితే వైవిధ్యమైన పాత్రలు కచ్చితంగా చేస్తాను. 

మరిన్ని వార్తలు