Vijayakanth Health Condition 2021: విజయ్‌ కాంత్‌కు అస్వస్థత

20 May, 2021 08:21 IST|Sakshi

చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ అనారోగ్యం మరోసారి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను బుధవారం చెన్నైలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కెప్టెన్‌ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్‌ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు.

అడపదడపా చెన్నై రామాపురంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన హెల్త్‌చెకప్‌ చేయించుకుంటున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో విపరీత జాప్యం చోటుచేసుకుంది. విజయకాంత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం కూడా అనుమానంగా మారింది. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం కూటమిలో చేరిన డీఎండీకే అభ్యర్థుల కోసం విజయకాంత్‌ తిరుచ్చిరాపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించినా ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు.

ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో  కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. ‘అలవాటుగా జరుపుకునే హెల్త్‌చెకప్‌ కోసం విజయకాంత్‌ను ఆసుపత్రిలో చేర్చాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇంటికి చేరుతారు. వదంతులను నమ్మవద్ద’ని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు