ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్‌ సతీమణి

19 Apr, 2021 08:16 IST|Sakshi

తమిళసినిమా: ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం విదితమే. ఆయన జీవితంలోని పలు విశేషాలను గుర్తుచేసుకుందాం.. వివేక్‌ చిన్నతనం నుంచి చాలా చలాకీగా ఉండేవారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పుట్టినరోజు నవంబర్‌ 19వ తేదీనే వివేక్‌ కూడా జన్మించారు. వివేక్‌ రెండో తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రితో మాట్లాడి ఇందిరాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. అందుకు బదులుగా ఇందిరా గాంధీ కూడా వివేక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాయడం విశేషం.

నటుడిగా ఎల్లలు దాటిన వివేక్‌ చిరకాల కోరిక ఆయన అంతిమదశలో నెరవేరింది. వివేక్..‌ రజినీకాంత్‌ నుంచి పలువురు ప్రముఖలతో కలిసి నటించారు. ఒక్క కమలహాసన్‌ మినహా. ఆ కోరిక ఇండియన్‌ –2 చిత్రంతో తీరింది. ఆ చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. అదే వివేక్‌ నటించిన చివరి చిత్రమైంది. మరో విషయం ఏమిటంటే వివేక్‌ దర్శకుడుగా మెగాఫోన్‌ పట్టడానికి సలహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్‌ అధినేత టీజీ త్యాగరాజన్‌ తన సంతాప ప్రకటనలో వెల్లడించారు. వివేక్‌ ఆ కల నెరవేరకుండానే నిష్క్రమించారు.

ఇదిలా ఉంటే.. అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా తీసుకున్న వివేక్‌ రాష్ట్రం వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనకు నివాళులర్పించే విధంగా అభిమానులు ఆదివారం నీలగిరిలో 4 లక్షల మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్నెసెంట్‌ దివ్య ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వివేక్‌ మృతికి  ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతలు సంతాపం ప్రకటించిన విషయం తెలిసింది. ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. దీంతో వివేక్‌ సతీమణి అరుళ్‌ సెల్వి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.   

చదవండి: వ్యాక్సిన్‌కు, వివేక్‌ మృతికి సంబంధం లేదు
కమెడియన్‌ వివేక్‌ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు