పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్‌ హీరోలు

23 Sep, 2023 04:23 IST|Sakshi

అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్‌ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్‌ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్‌ అవుతుంది. అలా డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్‌ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్‌ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్‌.. సెట్‌.. గెటప్స్‌ అంటూ ఆ స్టార్స్‌ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.  

విభిన్న భారతీయుడు
విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్‌ పది పాత్రల్లో పది గెటప్స్‌ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్‌ 2’లో కమల్‌హాసన్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ వీరి కాంబినేషన్‌లోనే రూపొందుతోంది.

1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్‌ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్‌ టాక్‌. వీటిలో లేడీ గెటప్‌ ఒకటనే టాక్‌ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్‌ మేకప్‌ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్‌ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

పెయింటరా? సైంటిస్టా?
పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్‌’ సినిమాలో రవితేజ క్యారెక్టర్‌ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్‌ అయ్యేది అప్పుడే. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఈగిల్‌’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ ఓ లీడ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్‌ స్నైపర్‌ గెటప్‌ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్‌ విడుదల కాలేదు.

పదికి మించి..
ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్‌ సెన్స్‌’, ‘24’, ‘బ్రదర్స్‌’...  ఇలా సూర్య కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్‌ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

స్టూడెంట్‌.. రాజకీయ నాయకుడు
కాలేజ్‌ స్టూడెంట్, ఐఏఎస్‌ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్‌ చేంజర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్‌ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

2 దశాబ్దాలు.. 4 గెటప్స్‌
‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్‌ తేజ్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్‌ తేజ్‌ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. వైజాగ్‌ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్‌ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు.

పలు అవతారాల్లో స్మగ్లింగ్‌
స్మగ్లింగ్‌ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్‌ స్మగ్లింగ్‌. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్‌ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్‌’ సినిమా కోసం. రాజు మురుగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు