ఐశ్వర్య రాజేష్‌ రీమేక్‌ మూవీలను ఎందుకు తిరస్కరిస్తోంది?

21 Apr, 2021 08:53 IST|Sakshi

బహుభాష నటిగానే కాకుండా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటి ఐశ్వర్య రాజేష్‌. తమిళంలో కనా, క.పే.రణసింగం వంటి  విజయవంతమైన చిత్రాల తరువాత మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ చిత్ర తమిళ రీమేక్‌లో ఈమె నటిస్తున్నారు. నటుడు రాహుల్‌ రవిచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌.కన్నన్‌ స్వీయ దర్శకత్వంలో తన మసాలా పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం కారైక్కుడి లో  పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్‌ ఇందులో నటించడం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా చిత్రాలను రీమేక్‌ చేయడం సులభమైన విషయం కాదన్నారు. అదేవిధంగా చిత్రానికి ఒరిజినల్‌ ఫీల్‌ తీసుకురావడం కష్టం అన్నారు. అందుకే తాను పలు రేమేక్‌ చిత్రాలను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కచ్చితంగా నటించాలని భావించానన్నారు.

కారణం ఈ చిత్రంలో సమాజానికి అవసరమైన మంచి సందేశం ఉందన్నారు. తాను ఇంతకుముందు క.పే.రణసింగం చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక యువతని కలిసి ఉన్నాను. ఆమెకు పెళ్లంటే తెలియని వయసులోనే వివాహం జరిగిపోయిందన్నారు. సమాజంలో మహిళల అభిప్రాయాలకు విలువ లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు.
చదవండి: ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు 

మరిన్ని వార్తలు