‘అప్పట్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నాం, కానీ!’

9 Apr, 2021 11:18 IST|Sakshi

సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వింతేమి కాదు. అప్పట్లో శ్రీరెడ్డి దీనిపై రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీటూ ఉద్యమం కూడా తీవ్ర దుమారం రేపింది. ఇక నటి మాధవిలత సైతం పలు ఇంటర్వ్యూలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కాస్టింగ్‌ కౌచ్‌కు గురికావాల్సిందే అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది. తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌పై ప్రముఖ సీనియర్‌ నటి అన్నపూర్ణ కూడా స్పందించారు.  ప్రస్తుతం ఆమె అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్‌-3’ మూవీలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్‌ కౌచ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కేరీయర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అలాగే క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అనవసరపు వ్యవహరమన్నారు. ‘అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారు. అవకాశం ఇస్తే మాకేంటని మా వెంట పడేవారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలు పెట్టాను. హీరోయిన్‌గా ఛాన్సులు వచ్చినప్పటికి రెండు సినిమాలకే ఆపేశాను. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవు.. అప్పుడు కూడా ఉండేవి కానీ ముందుగానే అలాంటి పనులు చేయమని ఒప్పందం ఇస్తేనే డేట్స్‌ ఇచ్చేవాళ్లం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 

అలాగే తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇద్దరికి ఇష్టమైతేనే ఆ తప్పులు జరుగుతాయని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి రంగంలో మహిళలు క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు వేటికి లొంగకుండా తప్పించుకు వస్తున్నారు. అదే మాదిరిగా సినీ పరిశ్రమ వాళ్లు కూడా తప్పించుకోవాలి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి’ అని చెప్పారు. అయితే తప్పులు జరగవని తాను చెప్పడం లేదని, ఇక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతాయన్నారు. అది కూడా ఇద్దరికి సమ్మతమైతేనే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇక్కడ కష్టాలు తప్పవని అన్నపూర్ణ అన్నారు.  

చదవండి: 
ఎన్టీఆర్‌, అఖిల్‌ల వీడియోపై ఆర్‌జీవీ షాకింగ్‌ కామెంట్స్
‘ఆర్‌ఆర్‌ఆర్’‌ రచయిత కేవీ ప్రసాద్‌కు కరోనా
‌‌

మరిన్ని వార్తలు