ఉత్తరాఖండ్‌ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా

9 Feb, 2021 10:30 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ లో మంచు చరియలు విరిగిపడి గంగానది ఉపనది అయిన ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్‌ప్రాజెక్ట్‌ని ముంచెత్తింది. అందులో పని చేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. పెను విషాదాన్ని కలిగించిన ఈ ఉత్పాతంపై సెలబ్రిటీలు సానుభూతి వ్యక్తం చేస్తున్నా దియా మిర్జా మాత్రం దిగులును, నిస్సహాయతను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ‘హిమాలయాల్లో చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం, ఆనకట్టలు, పవర్‌ ప్రాజెక్టులు నిర్మించడం... ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. అంతేకాదు అమాయకుల ప్రాణాలు బలిగోరుతున్నాయి’ అని దియా మిర్జా గట్టిగా గొంతెత్తింది.

గతంలో కూడా చాలాసార్లు పర్యావరణం గురించి మాట్లాడింది ఆమె. ‘గతంలో పుట్టినరోజు ఎవరిదైనా వస్తే ఏం బహుమతి ఇవ్వాలా అని నేను  తెగ హైరానా పడేదాన్ని. తర్వాత ఎవరి పుట్టినరోజు ఆహ్వానం నాకు అందినా వారి పేరు మీద 11 చెట్లు నాటి ఆ చెట్లు నాటిన స్థలాన్ని చూసి రమ్మని చెప్పేదాన్ని. అలా ఒక సంవత్సరంలో నేను దాదాపు 18 వేల చెట్లు నాటాను’ అని చెప్పుకుందామె. చెట్లు కూల్చి గోడలు కట్టుకోవాలనుకునే సమాజం మీద కట్టలు తెంచుకున్న నదులు విరుచుకు పడతాయని ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే అంత మేలు.

చదవండి: అనుబంధాల అంతరాలు త్రిభంగ

మరిన్ని వార్తలు