Actress Suicide: రూ.40 లక్షలు డిమాండ్‌.. యువ నటి ఆత్మహత్య

27 Dec, 2021 10:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. డ్రగ్‌ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్‌ 20న నటి స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్‌కు వెళ్లింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎన్‌సీబీ అధికారులమంటూ రైడ్‌ చేశారు. కేసు పెట్టకూడదంటే 40 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తామని బెదిరించారు.

దీంతో సదరు నటి అతికష్టం మీద రూ.20 లక్షలు సర్దగలిగింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. ఈ వ్యవహారంతో కలత చెందిన నటి డిసెంబర్‌ 23న తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైడ్‌ జరిపింది ఫేక్‌ ఎన్‌సీబీ అధికారులని గుర్తించారు. ఎన్‌సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్‌ పర్దేశి, ప్రవీణ్‌ వాలింబేను అరెస్ట్‌ చేశారు. అయితే ఆమె దగ్గర డబ్బు గుంజడానికి నటి స్నేహితులే ఆమెను పార్టీకి తీసుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎన్‌సీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీబీ అధికారులు ప్రైవేట్‌ ఆర్మీని సృష్టించి సెలబ్రిటీలను పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే అధికారులు మాత్రం నటి ఆత్మహత్యలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్‌సీబీకి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు