Actress Gautami: వెబ్‌ సిరీస్‌కు సెన్సార్‌ అవసరం: నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు

7 Jan, 2023 08:32 IST|Sakshi

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. సినిమాలకు మాదిరిగా వెబ్‌సిరీస్‌కు సెన్సార్‌ నిబంధనలు లేకపోవడంతో వాటిలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు హద్దు మీరుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నటి, కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలు గౌతమి వద్ద  ప్రస్తావించగా వెబ్‌ సిరీస్‌కు సెన్సార్‌ అవసరమని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. గౌతమి తాజాగా స్టోరీ ఆఫ్‌ థింగ్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో ముఖ్యపాత్రను పోషించారు.

ఈమెతో పాటు నటుడు భరత్, శాంతను భాగ్యరాజ్, రాజు, వినోద్‌ కిషన్, నటి అథితి బాలన్, రితికా సింగ్‌  నటించారు. చుట్పా ఫిలింస్‌ పతాకంపై రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌కు జార్జ్‌ దర్శకత్వం వహించారు. ఐదు స్టోరీస్‌తో రూపొందించారు. శుక్రవారం నుంచి సోనీ లివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ సన్నివేశాలతో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ఇదన్నారు. వేయింగ్‌ స్కేల్, మిర్రర్, కార్, కంప్రెషర్, సెల్యులార్‌ మొదలగు ఐదు కథలతో కూడిన వెబ్‌ సిరీస్‌ అన్నారు. 

దీన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌లో దెయ్యం లేకపోయినా అలాంటి థ్రిల్లింగ్‌ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో తాను నటించినట్లు గౌతమి తెలిపారు. ఇందులో ఒక్కో స్టోరీ ఒక్కో జానర్‌లో ఉంటూ వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. తనకు కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు నటుడు భరత్‌ చెప్పారు. గౌతమితో కలిసి నటించడం మంచి అనుభవంగా నటి అథితి బాలన్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు