Jayasudha: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్‌!

20 Sep, 2023 17:07 IST|Sakshi

హీరోయిన్‌గా ఒకప్పుడు వెలుగు వెలిగిన సహజ నటి జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి సినీ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వెండితెరపై అన్నిరకాల హావభావాలను ఒలికించే జయసుధ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే గతంలో జయసుధకు రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే!

కలిసిరాని రెండు పెళ్లిళ్లు
1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జితేంద్ర కపూర్‌ కజిన్‌ నితిన్‌ కపూర్‌తో 1985లో ఏడడుగులు వేసింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన 2017లో భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే జయసుధ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైందంటూ అప్పట్లో ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మూడో పెళ్లి?
అమెరికాకు చెందిన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మీదునియా కోడై కూసింది. కమెడియన్‌ అలీ కూతురి పెళ్లికి కూడా అతడిని వెంట తీసుకుని వెళ్లింది. వారసుడు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కూడా జయసుధ పక్కన అతడే ఉన్నాడు. దీంతో మూడో పెళ్లి నిజమేనంటూ ప్రచారం ఊపందుకోగా అదేమీ లేదని అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది సహజ నటి. తన బయోపిక్‌ తీసేందుకే ఇండియా వచ్చాడని, సినిమా ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే తన వెంట వస్తున్నాడని చెప్పింది.

మరోసారి ప్రియుడితో జయసుధ?
కానీ తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లోనూ జయసుధ వెంట ఆ ఫారినర్‌ ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుకలో నటితో పాటు పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతడు బయోపిక్‌ కోసం వచ్చినట్లు లేడని, కచ్చితంగా జయసుధ ప్రియుడేనని మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఈసారి జయసుధ ఏమని సమాధానం చెప్తుందో చూడాలి!

చదవండి: జయసుధ ఫోన్‌ లాక్కున్న మోహన్‌ బాబు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు