యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి

14 May, 2022 07:30 IST|Sakshi

సాక్షి, అమీర్‌పేట: యూ ట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి  ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్‌ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్‌ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్‌రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్‌ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది.

ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్‌ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.    

చదవండి: (చికెన్‌ 312 నాటౌట్‌.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు)

మరిన్ని వార్తలు