ఫేక్​ ఐడీతో అడ్డంగా దొరికిన బంగారం హీరోయిన్​​

30 May, 2021 08:03 IST|Sakshi

ఒకవైపు వ్యాక్సినేషన్​ విషయంలో ఏజ్​ గ్రూప్​ గందరగోళం నడుస్తుండగా, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్​ డోస్​లను బ్లాక్​లో అమ్ముకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు తేలికగా వ్యాక్సిన్​లు దొరుకుతున్న తీరు.. రోజుల తరబడి, గంటల సేపు లైన్​లో క్యూ కడుతున్న వాళ్లకు కోపం తెప్పిస్తోంది. తాజాగా నటి మీరాచోప్రా  ఫేక్​ ఐడీతో వ్యాక్సిన్​ వేయించుకోవడం.. రాజకీయ విమర్శలకు దారితీసింది. 

థానే: నటి, మోడల్ మీరా చోప్రా ఈమధ్యే కరోనా వ్యాక్సిన్​ వేయించుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్​ వేయించుకోవాలని ఆమె తన ఇన్​స్ట్రాగ్రామ్​లో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆమె ఫ్రంట్​లైన్​ వారియర్​ కోటాలో ఫేక్​ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ మండిపడుతోంది.

మీరా చోప్రా అలియాస్​ నీలా తమిళంతో పాటు తెలుగు, హింది సినిమాల్లో నటించింది. ఆమె థానేలోని పార్కింగ్​ ప్లాజా వ్యాక్సినేషన్​ సెంటర్​ దగ్గర డోస్​ వేయించుకుంది. ఓం సాయి ఆరోగ్య కేర్​ ప్రైవేట్ లిమిటెడ్​లో ఆమె సూపర్​వైజర్​గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్​ ఐడీ క్రియేట్ చేశారు. ఇది ముమ్మాటికీ రూల్స్​ను ఉల్లంఘించినట్లే. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ కోరుతోంది. కాగా, ఈ విచారణపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్​ పీఆర్వో సందీప్​ మాల్వీ​ చెబుతున్నారు. 

కాగా, తెలుగులో బంగారం, మారో, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. పలు తెలుగు, తమిళ్​, హిందీ చిత్రాల ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే వ్యాక్సినేషన్​పై దుమారం చెలరేగడంతో ఆమె తన ఇన్​స్టాగ్రామ్​ నుంచి పోస్ట్​ తొలగించడంతో పాటు మీడియాకు దొరక్కుండా తిరుగుతోందని సమాచారం. 

మరిన్ని వార్తలు