Sourav Ganguly And Nagma: అప్పట్లో వివాదంగా నగ్మా-గంగూలీ ప్రేమ వ్యవహారం, ఏమైందంటే!

8 Jul, 2021 18:54 IST|Sakshi

నగ్మా, గంగూలీ ఎందుకు విడిపోయారో తెలుసా!

గతంలో హాట్‌ టాపిక్‌గా వారి బ్రేకప్‌ మ్యాటర్‌

ఇక్కడ సినిమా, క్రికెట్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలను ఎంతగా ప్రేమించేవారున్నారో.. అంతకంటే ఎక్కువగా క్రికెట్‌ను ఆరాధించే వారు  ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. సినీ నటులు రీల్‌ హీరోలు అయితే, మన క్రికెటర్స్‌ను రియల్‌ హీరోలుగా చూస్తారు. అయితే క్రికెటర్లు కొంతమంది బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. మహమ్మద్‌ అజారుద్దీన్‌ నుంచి నేటీ తరం యువ క్రికెటర్స్‌ వరకు పలువురు హీరోయిన్స్‌తో డేటింగ్‌ చేసినవారే. అయితే అందులో కొందరు పెళ్లిపీటలు ఎక్కగా మరికొందరూ బ్రేకప్‌ చెప్పుకుని విడిపోయారు. ఇందులో మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ కూడా ఉన్నాడు. నేడు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. అందులో నటి నగ్మాతో ఆయన నడిపిన ప్రేమ వ్యవహారం కూడా ఉంది. 

దాదా అంటూ క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ నగ్మాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారనే విషయం తెలిసిందే. గంగూలీ, నగ్మాల డేటింగ్‌ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే దాదా అప్పటికే 1997లో డోనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 90లలో నగ్మా క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన నగ్మా బాలీవుడ్‌లోను నటించింది. హిందీలో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించి అక్కడ కూడా అగ్రనటిగా ఎదిగింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడతో పాటు భోజ్‌పూరి, బెంగాలీ, పంజాబీ, మరాఠ వంటి  భాషల్లో కూడా నగ్మా నటించి తన సత్తా చాటుకుంది.  

ఈ క్రమంలోనే దాదా ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తూ విందులు, పార్టీలకు జంటగా హాజరయ్యేవారు. అప్పటి వరకు చిన్నపాటి రూమర్‌గా ఉన్న వారి లవ్‌ మ్యాటర్‌ 1999 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో ఒక్కసారిగా గుప్పుమంది. లండ‌న్‌లో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ సందర్భంగా వీరిద్దరూ అక్కడికి జంటగా వెళ్లారు. లండన్‌లో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగి వీరి ఫొటోలు బయటకు రావడంతో ఈ రూమర్లకు మరింత ఆధ్యం పోసినట్లు అయ్యింది. అప్పటి నుంచి వీరి రిలేషన్‌ హాట్‌టాపిక్‌ మారింది. ఇక గంగూలీ కెప్టెన్‌ అయ్యాక కూడా వారి ప్రేమ వ్యవహారం సాగింది. ఈ క్రమంలో నగ్మా, గంగూలీలు జంటగా శ్రీకాళహస్తి వెళ్లి పూజ చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. ఇది అప్పట్లో మరింత వివాదాస్పదంగా మారింది. 

ఈ క్రమంలో వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని, గంగూలీ, నగ్మాను రెండో వివాహం చేసుకున్నాడంటూ పుకార్లు హల్‌చల్‌ చేశాయి. దీంతో దాదా, నగ్మాలు స్పందిస్తూ వారి మధ్య ఏం లేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పటికే వారిద్దరూ వ్యక్తిగత కారణాలు వల్ల విడిపోయి ఒకరితో ఒకరూ సంబంధం లేకుండా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నగ్మా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాతో తన రిలేషన్‌, ప్రేమ, బ్రేకప్‌పై నోరు విప్పిన సంగతి తెలిసిందే. తను, గంగూలీ ప్రేమించుకున్న మాట నిజమేనని, కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల తాము విడిపోయినట్లు ఆమె అంగీకరించింది. ‘అప్పుడు నా సినీ కెరీర్‌ పీక్స్‌లో ఉంది. క్రికెటర్‌గా గంగూలీ కెరీర్ కూడా. ఆ సమయంలో ఈగో మా బంధానికి అడ్డుగా నిలిచింది. అనుబంధంలో అహానికి చోటు ఉంటే ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపలేం కదా’ అంటూ మనస్పర్థల వల్ల వారిద్దరూ విడిపోయినట్లు నగ్మా స్పష్టం చేసింది. కానీ నగ్మా ప్రవర్తన నచ్చకే గంగూలీ ఆమెతో రీలేషన్‌కు పుల్‌స్టాప్‌ పెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు