Pooja Hegde: అలా అయితే పెళ్లి వద్దు.. వివాహ బంధంపై పూజా హెగ్డే ఆసక్తిర వ్యాఖ్యలు

5 Dec, 2021 04:26 IST|Sakshi

– పూజా హెగ్డే

పూజా హెగ్డే సినిమాలను ప్రేమించారు.. అభిమానులు ఆమెని ప్రేమించారు. పూజ అంకితభావం చూసి ఇండస్ట్రీ ఆమెను ప్రేమించింది. ‘లక్కీ చార్మ్‌’ అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ పూజాని ప్రేమగా పిలుచుకుంటోంది. సినిమా ద్వారా ఇంత ప్రేమని పొందారు కాబట్టి సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ అనే ఫౌండేషన్‌ ఆరంభించారు పూజా హెగ్డే. ‘ప్రేమ.. ఒక బలమైన భావోద్వేగం’ అంటున్నారు పూజ. ఇంకా ‘సాక్షి’తో పూజా హెగ్డే పంచుకున్న విశేషాలు తెలుసుకుందాం.

► ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరు సినిమాలతో మీ కెరీర్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది...
పూజా హెగ్డే: అవును.. కెరీర్‌ బిజీగా ఉంది. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని నేను ఆలోచించినా ‘ఏం ఫర్వాలేదు.. మ్యానేజ్‌ చేద్దాం.. ఒప్పుకోండి’ అని నా నిర్మాతలు అభిమానంగా అంటున్నారు. ఎందుకంటే నేను పనిని ఎంత శ్రద్ధగా చేస్తానో, నా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు తెలుసు. ‘మీ కోసమే ఈ పాత్ర రాశాం’ అని డైరెక్టర్లు అన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలనిపిస్తుంది. అందుకే చేసే ప్రతి పాత్రకు వంద శాతం ఎఫర్ట్‌ పెడతాను.

► మీరుంటే సినిమా హిట్‌ అని, ‘లక్కీ చార్మ్‌’ అని టాక్‌... ఈ ట్యాగ్‌ పెద్ద బరువు కాబట్టి సినిమా రిలీజ్‌ ముందు మీకు నిద్రలేని రాత్రులు ఉంటాయా?
(నవ్వుతూ) ఇంత ప్రేమను ఇస్తున్న ఫ్యాన్స్‌ దొరకడం, మంచి పాత్రలు ఇస్తున్న దర్శక–నిర్మాతలు దొరకడం నా ‘లక్‌’ అని నేను అనుకుంటాను. ఏ సినిమా చేసినా అది పెద్ద హిట్‌ అవ్వాలని శాయశక్తులా కృషి చేస్తాను. అయితే లక్కీ చార్మ్‌ ట్యాగ్‌ లేకపోయినా సినిమా రిలీజ్‌కు ముందు నాకు టెన్షన్‌ ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అలాగే లక్కీ చార్మ్‌ అనేది ఫస్ట్‌ కొన్నిసార్లే బావుంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్‌ అయితే లక్‌. ఐదోసారి ఆరోసారి కూడా హిట్స్‌ సాధిస్తే అది కేవలం లక్‌ కాదు. సరైన స్క్రిప్ట్స్‌ ఎంచుకోవడమే కారణం. కథ విన్నాక, ఈ సినిమా చేసే తీరాలనిపిస్తే చేసేస్తాను. అలా ధైర్యంగా నమ్మి చేసిన సినిమాలు విజయం సాధించాయి. నేను వదులుకున్న కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. నమ్మిన సినిమాలు హిట్టవడంతో నా జడ్జిమెంట్‌ మీద నమ్మకం పెరిగింది. అందుకే నా సినిమాలు హిట్‌ కావడమనేది పూర్తిగా లక్‌ మాత్రమే కాదు.

► ‘పెళ్లిలో సర్దుకుపోవడం’ అనే కాన్సెప్టే నచ్చని విభా పాత్ర (‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో పూజ పాత్ర పేరు) చేశారు. రియల్‌ లైఫ్‌లో ఒక రిలేషన్‌ సక్సెస్‌ అవ్వడానికి సర్దుకుపోవాలేమో?
అన్నయ్య, ఫ్రెండ్, లవర్, లైఫ్‌ పార్ట్‌నర్‌... ఇలా ఎవరికైనా మన ఇష్టంతో చేసేదాన్ని సర్దుకుపోవడం అనం. వాళ్లతో ఉన్న అనుబంధం వల్ల చేస్తాం. పిల్లలు అర్ధరాత్రి నిద్రలేచి ఆకలి అంటే అప్పటికప్పుడు అమ్మ ఏదైనా చేసి పెడుతుంది కదా. వాళ్లు తిని హాయిగా బజ్జుంటారు. కానీ నిద్ర త్యాగం చేశానని అమ్మ ఎప్పటికీ అనుకోదు. ఎందుకంటే పిల్లల కోసం ఇష్టంగా చేస్తుంది. ఇష్టపడేవారికి ఇష్టంతో చేసింది ఎప్పుడూ ‘కాంప్రమైజ్‌’ కాదు. ఒక బంధం కోసం చేసేది ‘సర్దుకుపోవడం’ అనే ఫీలింగ్‌ వారి వారి ఆలోచనా ధోరణి బట్టి ఉంటుంది. నా వరకు నేను దాన్ని సర్దుకుపోవడం అనను. మనవాళ్ల కోసం చేస్తున్నాం అనుకుంటాను.

►  ‘మ్యారీడ్‌ టు వర్క్‌’ అంటున్నారు. పెళ్లెప్పుడు?
ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్నాను.

► వివాహ బంధం గురించి మీ అభిప్రాయం?
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటారు కదా. సో.. అవి చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్యే నేను ముంబైలో ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడమే ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందో (నవ్వుతూ). కానీ నేను నమ్మేది ఒకటే. వీళ్లతో జీవితాంతం కలిసుంటే బావుంటుంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడి వల్లో, అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారనో మాత్రం చేసుకోకూడదు.

► హీరోయిన్‌ అంటే వదంతులు కామన్‌. మీరు వాటిని తట్టుకునేంత ధైర్యం ఉన్న అమ్మాయేనా?
మా అమ్మగారు ఇండిపెండెంట్‌ ఉమన్‌. కానీ వాళ్ల నాన్నగారు చాలా స్ట్రిక్ట్‌. అయినా మా అమ్మ చాలా ఇండిపెండెంట్‌గా ఉన్నారు. మా నాన్న ఓపెన్‌ మైండెడ్‌. పరిస్థితులను వివరిస్తూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా నన్ను పెంచారు. హీరోయిన్‌ని కాబట్టి చాలా గాసిప్స్‌ వస్తుంటాయి. అవన్నీ తట్టుకునేంత ధైర్యం ఉన్న అమ్మాయిలా మా అమ్మానాన్న నన్ను పెంచారు. మనవాళ్లతో మనం క్లియర్‌గా, ఓపెన్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఉండాలి. మన అభిప్రాయాలను వారితో ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. ఇంట్లో మనకంత స్వేచ్ఛ ఉన్నప్పుడు దేన్నయినా ఎదుర్కొంటాం. మా ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉంది. అయితే సమాజంలో అందరూ తమకు అనిపించినది అనిపించినట్లుగా చెప్పుకోగలిగే పరిస్థితి ఇంకా రావాలన్నది నా ఫీలింగ్‌.

► ఏదైనా విషయాన్ని సున్నితంగా చెప్పొచ్చు... కఠినంగా చెప్పొచ్చు. మీరు వదంతులకు రియాక్ట్‌ అవ్వాలనుకుంటే ఎలా అవుతారు?
నేను కూల్‌ పర్సన్‌. నాకు పెద్దగా కోపం రాదు. కోపం వచ్చినా, అప్‌సెట్‌ అయినా అరవను... ఏడ్చేస్తాను. ప్రతిదానికీ మనం కఠినంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను. అయితే మన ఆత్మగౌరవం దెబ్బతీసేలాంటి పరిస్థితుల్లో మాత్రం కఠినంగా ఉండొచ్చని నమ్ముతాను. అంతేకానీ ప్రతి చిన్నదానికీ బీపీ పెంచుకోవడం వేస్ట్‌ అని నా ఫీలింగ్‌. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది.


 
► ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ అనే ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు... దాని గురించి?
ఉన్న ఎమోషన్స్‌లో ‘ప్రేమ’ చాలా బలమైనదని నా నమ్మకం. ప్రేమతో ఏం చేసినా మనసుకి బాగుంటుంది. ఎప్పుటి నుంచో చారిటీ చేస్తున్నాను. అయితే ఫౌండేషన్‌ ద్వారా చేస్తే ఇంకా చాలా చేయొచ్చనిపించింది. అందుకే ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ ఆరంభించాను. చిన్నప్పుడు చాలామంది సేవా కార్యక్రమాలు చేయడం చూసి, ‘పెద్దయ్యాక మనం కూడా చేయాలి’ అని ఫిక్స్‌ అయ్యాను. సొసైటీకి తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఈసారి నా బర్త్‌డేకి నా ఫ్యాన్స్‌ సేవా కార్యక్రమాలు చేస్తే, నేను సంతోషడ్డాను. ‘ఇంతే చేయాలి’ అని గిరి గీసుకోలేదు. ఎంతైనా చేయాలని నిర్ణయించుకున్నాను. సంపాదించుకుంటూ.. అందులో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే ఓ ఆత్మతృప్తి దక్కుతుంది.

మరిన్ని వార్తలు