ఆ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నా: పూర్ణ

30 Nov, 2021 05:20 IST|Sakshi

‘‘సెలబ్రిటీలు పబ్లిక్‌ ప్రాపర్టీ అని నా ఫీలింగ్‌. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్‌ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్‌ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’’ అని పూర్ణ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణ–బోయపాటిగార్ల కాంబినేషన్‌లో ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్ర చేశాను.

కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. నా లక్కీ నంబర్‌ 5. 2021ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్‌గానే చేయాలని ఫిక్స్‌ అవ్వలేదు. సినిమాలో నాలుగైదు సీన్లు చేసినా ప్రాధాన్యత ఉండాలనుకుంటాను. శోభన, రేవతి, సుహాసినిగార్లలా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. ‘దృశ్యం 2’లో లాయర్‌గా బాగా నటించావని చాలామంది అభినందించారు. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్‌ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు