ఆ హీరోయిన్‌ బయోపిక్‌లో నటించాలని నా కోరిక: రష్మిక

16 Sep, 2021 21:20 IST|Sakshi

ప్రతీ ఒక్కరికీ ఓ కల ఉంటుంది అలానే తనకంటూ ఓ కల ఉందని అంటోంది శాండిల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన. తెలుగుతెరపై అగ్రనటిగా ఎదిగిన దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించడం తన కోరికని తెలిపింది రష్మిక. కర్ణాటకలో జన్మించిన సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలంపాటు తన హవా కొనసాగించిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది.

ఇటీవల బాలీవుడ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సౌందర్య తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ నటి అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌లు తాజా ట్రెండ్ అని ఈ తరుణంలో తనకి అవకాశం వస్తే సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని, అది తన కోరిక కూడా అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తనకు స్ఫూర్తి అని రష్మిక పేర్కొన్నారు. రష్మిక 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ నటి  తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. వరుసగా హీందిలో ఆఫర్ల రావడంతో ఈ ముద్దు గుమ్మ తన మకాంను ముంబైకి మార్చేసింది.

ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో కథానాయికగా నటిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సౌందర్య బయోపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. సౌందర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకో ఈమె బయోపిక్‌కి అడుగులు ముందు పడడం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు కూడా సౌందర్య సొంతం చేసుకుంది.

చదవండి: Bigg Boss 5 Telugu: దీప్తి సునయన స్థానంపై కన్నేసిన హమీదా, షణ్నూకు ఆఫర్‌

మరిన్ని వార్తలు