సంజన గల్రానికి పెళ్లయిందా?

11 Sep, 2020 07:50 IST|Sakshi
సంజన గల్రాని

సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్‌ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్‌ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు.

మత్తు గుట్టురట్టు
శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో సీసీబీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. వారి సన్నిహితులు, మిగతా నిందితులు ముఖ్య సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను డెబిట్, క్రెడిట్, బిట్‌ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్‌ వెబ్‌లో డ్రగ్స్‌ ముఠాలు, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలిసింది. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన)

మరికొందరు నటీమణులు?  
కొందరు నటీమణులు డ్రగ్స్‌ పార్టీలలో పాల్గొనేవారని సీసీబీ విచారణలో బయటపడింది. రవిశంకర్, రాహుల్, వీరేన్‌ఖన్నాలు ముగ్గురూ విచారణలో రాగిణి, సంజనల పేర్లు చెప్పినట్లు  తెలిసింది. మరికొందరు నటీమణులకు కూడా డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు నిందితులు తెలిపారు. నటి సంజనా గతంలో కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సీసీబీ పోలీసులకు చిక్కింది. డ్రగ్స్‌ కేసులో 13వ నిందితుడు నియాస్‌ అహమ్మద్‌ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కేసుల్లో నిందితులు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీసీబీ పోలీసులు మరింతకాలం విచారించాల్సి ఉన్నందుకు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.   

ఇద్దరికీ విడి విడి గదులు  
డ్రగ్స్‌ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఐదు పడకలు ఉన్న హాల్‌ను ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వగా, ప్రత్యేక గదులు కావాలని పట్టుబట్టారు. వారిద్దరి మధ్య విభేదాలున్నందున ప్రత్యేక గదులను కేటాయించి భద్రతను పెంచారు.

ల్యాబ్‌కు ఇద్దరి మొబైళ్లు
సీసీబీ పోలీసులు రాగిణి, సంజనాల మొబైల్‌ఫోన్ల నుంచి వాట్సాప్, అవుట్‌ గోయింగ్‌ కాల్‌ డేటాను సేకరిస్తున్నారు. సుమారు 100 మందితో వీరు నిత్యం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అరెస్ట్‌ చేస్తారని తెలియడంతోనే వీరు మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి సమాచార పునరుద్ధరణ చేస్తున్నారు.   

రాగిణికి అస్వస్థత  
రాగిణి తల తిరుగుతున్నట్లు, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో ఆమెను కేసీ జనరల్‌ ఆస్పత్రికీ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా లో బీపీతో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నట్లు బయట పడింది. రక్తపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా రాగిణి వ్యతిరేకించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పగా, సరేనన్నారు.  

మరిన్ని వార్తలు