ఈ పుస్తకమంటే శ్రియాకు ఎంతో ఇష్టమట

27 Jan, 2021 12:18 IST|Sakshi

‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆమెకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటి ది ఎనార్కి. ‘వైట్‌ మొగల్‌’ ‘ది లాస్ట్‌ మొగల్‌’...మొదలైన పుస్తకాలతో పాఠకుల ఆదరణ పొందిన స్కాటిష్‌ చరిత్రకారుడు, రచయిత, కళా విమర్శకుడు విలియం డాల్‌ర్లింపుల్‌ రాసిన పుస్తకం ఇది. ఈస్టిండియా కంపెనీపై రాసిన ‘ది ఎనార్కి’  పరిచయం సంక్షిప్తంగా....

ఈస్టిండియా కంపెనీపై రాసిన పుస్తకం అనగానే కలిగే తొలి సందేహం...అసలు కొత్తగా రాయడానికి ఏముంది? రాజకీయ, ఆర్థిక, సైనిక కోణాలలో చాలామంది రాశారు కదా! అని. ‘నా ఉద్దేశం కంపెనీ సంపూర్ణచరిత్ర తెలియజేయడం కాదు. కంపెనీ వ్యాపారదక్షతకు సంబంధించిన ఆర్థికవిశ్లేషణ కూడా కాదు. రాజకీయాలు, పాలనతో ఏమాత్రం సంబంధం లేని ఒక కంపెనీ అత్యంత బలమైన మొఘల్‌ సామ్రాజ్యాన్ని ఎలా మట్టికరిపించగలిగింది? వినయవిధేయతలు ఉట్టిపడే కంపెనీగా ప్రవేశించి సామ్రాజ్యవాదశక్తిగా ఎలా ఎదిగింది? అనే కోణంలో రాసిన పుస్తకం’ అంటాడు రచయిత. 1599లో కంపెనీ పుట్టుక నుంచి పుస్తకం మొదలవుతుంది. ‘భారతదేశ«ం నుంచి ఇంగ్లిష్‌ భాషలోకి చేరిన తొలి పదం...లూట్‌’ అనే ఒకేవాక్యంలో ఎన్నో విషయాల సారం చెప్పాడు డాల్‌ర్లింపుల్‌.

క్వీన్‌ ఎలిజబెత్‌1 బ్రిటీష్‌ రాణిగా ఉన్న కాలంలో 1600లో ఈస్టిండియా కంపెనీ ఆసియాలోకి అడుగుపెట్టింది. తమ  కంపెనీలో పనిచేయడం, తమ  వస్తువును కొనడంపై మోజు పెంచింది. వ్యాపారపరమైన ఏకఛత్రాధిపత్యంతో పాటు ఇతర విషయాలలోనూ దాని జ్యోకం పెరిగింది. వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉన్న కంపెనీకి రాజకీయాలు అవసరమా? అనే విషయంలో బ్రిటీష్‌ పార్లమెంట్‌లో వాడివేడిగా చర్చ జరిగింది. ఈస్టిండియా వైఖరిని బ్రిటీష్‌ పత్రికలు ఘాటుగా విమర్శించాయి. భారతదేశంలో ఈస్టిండియా పాలనను క్రమబద్ధీకరిస్తూ  పార్లమెంట్‌లో రెగ్యులెటింగ్‌ చట్టం కూడా చేశారు.

భారతఉపఖండంలోని సంపన్నప్రాంతాలను కైవసం చేసుకున్న కంపెనీ మొగల్‌ పాలకులపై పాలనాధికారి పాత్ర పోషిచింది. కంపెనీ అనూహ్యంగా దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. బ్రిటీష్‌  వారిపై తిరగుబాటు నినాదం వినిపించడంలో పేరున్న సిరాజ్‌–ఉద్‌–దౌలా గురించి భిన్నమైన స్వరం వినిపిస్తుంది. ‘ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ, బెంగాలీలలో సిరాజ్‌ గురించి గట్టి ఆధారాలు దొరుకుతాయి. అతడి గురించి చెప్పుకోవడానికి ఒక్క మంచి పదం దొరకదు’ అంటాడు రచయిత.

ప్లాసీ యుద్ధం తరువాత ఈస్డిండియా కంపెనీ అత్యంత సంపన్న శక్తిగా ఎలా ఎదిగింది? మొఘల్‌ సామ్రాజ్యానికి షా అలం పేరుకు మాత్రమే రాజు ఎందుకు అయ్యాడు? అతడిని ‘చదరంగ రాజు’ అని మరాఠాలు, బెంగాల్‌ నవాబులు వెక్కిరించడానికి కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పుస్తకం సమాధానం చెబుతుంది. ఈ పుస్తకంలో బాగా ఆసక్తి కలిగించే ఘట్టం గులామ్‌ ఖదీర్‌. ఇతడి తండ్రి ఢిల్లీపై పోరాడి ఓడిపోతాడు. పదిసంవత్సరాల వయసులో ఖదీర్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు షా ఆలామ్‌. అందంగా, చురుగ్గా ఉండే  ఈ బాలుడిపై మొగల్‌ పాలకుడికి ప్రత్యేక ప్రేమ. ‘నా ప్రత్యేకమైన కుమారుడు’ అని స్వయంగా ప్రకటిస్తాడు కూడా. అలాంటి కుమారుడు పెరిగి పెద్దయ్యాక కనివిని ఎరగని అరాచకాలకు ఎలా పాల్పడ్డాడు?...ఇవి పుస్తకంలో చదవాల్సిందే. ఎవరికీ తెలియని ఆధారాలను వెలికి తీసి రాసిన ఈ పుస్తకానికి ఇప్పటి వరకు ఈస్టిండియా కంపెనీపై వచ్చిన పుస్తకాల జాబితాలో తప్పకుండా ప్రత్యేక స్థానం ఉంటుంది.

మై ఫెవరెట్‌ బుక్‌: ది ఎనార్కి
రచన: విలియం డాల్‌ర్లింపుల్‌ 

మరిన్ని వార్తలు