Sona Heiden: శృంగార తారగా ముద్రపడ్డ నటి జీవితంపై వెబ్‌ సిరీస్‌..

14 Sep, 2023 10:13 IST|Sakshi

ఎవరిదైనా బయోపిక్‌ను తెరకెక్కించాలంటే అందుకు తగిన ఘన చరిత్ర ఉండాలి. ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసే సంఘటనలు ఉండాలి. అలాంటి పలు చిత్రాలు తెరకెక్కి సక్సెస్‌ అయ్యాయి కూడా. ఇందిరాగాంధీ, క్రీడాకారుడు ఎంఎస్‌.ధోని వంటివి అలా రూపొందిన చిత్రాలే. కాగా తాజాగా శృంగార తారగా ముద్రపడ్డ నటి సోనా బయోపిక్‌ను వెబ్‌ సిరీస్‌గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కుశేలన్‌ చిత్రంలో వడివేలుకు భార్యగా నటించి గుర్తింపు పొందిన బోల్డ్‌ లేడీ సోనా.

అదే విధంగా గురు ఎన్‌ ఆళు, అళగర్‌ మలై, ఒంబదుల గురు, జిత్తన్‌– 2 మొదలగు పలు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆంధ్రావాలా, కథానాయకుడు, విలన్‌, ఆయుధం వంటి సినిమాలు చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందిన సోనా నిర్మాతగానూ మారి అమ్మా క్రియేషన్స్‌ టీ.శివతో కలిసి కనిమోళి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా మరో చిత్రాన్ని కె.భాగ్యరాజ్‌ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టినా అది పలు సమస్యల కారణంగా తెరకెక్కలేదు.

అలాంటిది తాజాగా తన జీవిత చరిత్రలోని ఒక భాగాన్ని వెబ్‌ సిరీస్‌గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సోనానే దర్శకత్వం వహించనున్నారట. దీనికి స్మోక్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందులో తను నటించకుండా మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

చదవండి:  'భోళా శంకర్‌' దెబ్బతో రూట్‌ మార్చిన మెహర్‌ రమేష్‌

మరిన్ని వార్తలు