Sri Lakshmi: నాన్న స్టార్‌ హీరో.. కానీ ఇంటి నిండా కష్టాలు.. ఒక్కో సినిమాకు లక్ష సంపాదించే తమ్ముడు కూడా!

2 Apr, 2023 17:42 IST|Sakshi

తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలు కలుపుకుని 500కు పైనే సినిమాలు చేసింది నటి శ్రీ లక్ష్మి. 1983లో వచ్చిన రెండు జళ్ల సీతలో నవ్వులు పండించిన ఆమె తర్వాత కూడా కమెడియన్‌గానే రాణించింది. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో ఆమె చెప్పిన బాబూ.. చిట్టీ డైలాగు అప్పటికీ, ఇప్పటికీ ఫేమసే. హావభావాలతోనే కామెడీ పండించే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి స్టార్‌గా వెలుగొందింది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం. నాన్న అమర్‌నాథ్‌ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద హీరో. జాండిస్‌ రావడంతో పని చేయడం మానేశాడు. సైడ్‌ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని మొండికేశాడు. ఆర్థిక కష్టాలు తీవ్రం కావడంతో అమ్మ నన్ను ఇండస్ట్రీలోకి పంపించాలనుకుంది. కానీ నాన్నకు అసలు ఇష్టం లేదు. ఆడపిల్లవి, ఇండస్ట్రీలో కష్టాలు పడటం ఎందుకమ్మా? అన్నాడు. పరిస్థితులు బాలేవు కదా అని బదులిస్తే నా చేతకానితనం వల్లే ఇలా మాట్లాడుతున్నావంటూ బాధపడ్డాడు.


శ్రీలక్ష్మి సోదరుడు, నటుడు రాజేశ్‌

మరోవైపు అమ్మ మాత్రం.. నువ్వు నటిస్తేనే అందరం కడుపునిండా తినగలుగుతాం, లేదంటే విషం తాగి చస్తాం అంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చి 41 ఏళ్లుగా రాణిస్తున్నా. శుభోదయం సినిమాకు హీరోయిన్‌గా సంతకం చేశాక నాన్న చనిపోయారు. నేను ఇంటిదగ్గర ఉండాల్సి రావడంతో ఆ అవకాశం చేజారిపోయింది. కానీ హీరోయిన్‌గా చేయకపోవడం వల్లే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉండగలిగాను. నా తమ్ముడు రాజేశ్‌ కూడా హీరో అయ్యాడు. ఆరోజుల్లోనే లక్ష రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు. ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా వెళ్లిపోయాడు. సెట్‌లో ఉన్నంతసేపు నేను సంతోషంగా ఉండేదాన్ని. 

ఇంటికి వెళ్లాలంటే మాత్రం భయమేసేది. ఆ కష్టాలు, బాధలు భరించలేకపోయేదాన్ని. కానీ మేము ఎనిమిది మందిమి కాస్తా ముగ్గురమే మిగిలాం.. అదే నాకు బాధనిపిస్తూ ఉంటుంది. నాకు పెళ్లైంది. భర్త ఉన్నాడు. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదు, చెప్పను కూడా! ఎందుకంటే తన గురించి అందరికీ తెలియడం తనకిష్టం లేదు. నేను నా కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డాను. అయితే ప్రొఫెషనల్‌గా మాత్రం ఇక్కడే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి.

మరిన్ని వార్తలు