పని లేదు.. పదేళ్లుగా గర్భాశయ వ్యాధితో పోరాటం: నటి

15 May, 2021 21:18 IST|Sakshi

ది కపిల్‌ శర్మ షో ఫేం నటి సుమోనా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించారు. కోవిడ్‌ కారణంగా గత కొన్ని రోజులగా తనకు పని లేదని.. పదేళ్లుగా తాను ఎండోమెట్రియోసిస్‌ (గర్భాయశ సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్నాని.. ప్రస్తుతం అది నాల్గవ స్టేజ్‌లో ఉందని వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు సుమోనా చక్రవర్తి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా మానసికంగా చాలా కుంగిపోయానని తెలిపారు. లాక్‌డౌన్‌లో తన పరిస్థితి ఎలా ఉంది.. దాని నుంచి ఎలా బయటపడిగలిగింది వంటి తదితర అంశాల గురించి తెలిపారు. తాను చెప్పే విషయాలు కొందరిలోనైనా స్ఫూర్తి కలిగిస్తాయనే ఉద్దేశంతోనే వీటన్నింటిని వెల్లడిస్తున్నాను అన్నారు. 

సుమోనా మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత వ్యాయామం చేశాను. చాలా బాగా అనిపించింది. కొంతకాలంగా చేతిలో ప్రాజెక్ట్స్‌ లేవు. నిరుద్యోగిగా మారాను. నా మీద నాకే కోపం వచ్చేది. చాలా గిల్టీగా ఫీలయ్యేదాన్ని. నిరుద్యోగిగా ఉన్నప్పటికి కూడా నా కుటుంబాన్ని, నన్ను పోషించుకోగల్గుతున్నాను. అది చాలా మంచి విషయం. ఇక లాక్‌డౌన్‌ వల్ల కలిగిన మానసిక సమస్యలు దూరం చేసుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం ముఖ్యం’’ అన్నారు. 

‘‘ఇంతవరకు దీని గురించి ఎవరికి చెప్పలేదు. 2011 నుంచి నేను ఎండోమెట్రియోసిస్‌తో పోరాడుతున్నాను. ప్రస్తుతం నాల్గో దశలో ఉంది. ఒత్తిడి అస్సలు మంచిది కాదు. ఇది చదివిన వారందరూ ఓ విషయం అర్థం చేసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదు. అలానే మా జీవితాలు వడ్డించిన విస్తరి కావు. మాకు చాలా సమస్యలుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. దానితో పోరాడుతుంటాం. మన చుట్టూరా ఎక్కువగా నష్టం, అసహనం, ద్వేషం, దుఖం, ఒత్తిడి, నొప్పి ప్రతికూల భావనలే ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ప్రేమ, దయ. అవి ఉంటే చాలు ఈ తుపానును దాటగల్గుతాం’’ అన్నారు. 

‘‘ఇక వ్యక్తిగత సమస్యల గురించి ఇంత బహిరంగంగా చెప్పడం అంత సులువు కాదు. నేను నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తున్నాను. ఈ పోస్ట్‌ కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలదని.. కొందరిలోనైనా చిరునవ్వులు పూయించగలదని ఆశిస్తున్నాను’’ అంటూ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.  

చదవండి: ‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’

మరిన్ని వార్తలు