'అది పెద్ద సమస్యేమీ కాదు.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుంటా'

3 Nov, 2022 07:09 IST|Sakshi

ఇమేజ్‌ అనే చట్రంలో ఇరుక్కోకుండా అన్ని భాషల్లోనూ అన్ని రకాల పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకుని నటించే నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఒకరు. ఈమె వారికి, వీరికి అన్న భేదం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధం అంటున్నారు. అలా తాజాగా నటి సమంత ప్రధాన పాత్ర ధరించిన యశోద చిత్రంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. ఇది ఈ నెల 11వ తేదీన పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఒక భేటీలో పేర్కొంటూ యశోద చిత్రంలో తాను అద్దె తల్లిని సమకూర్చిన వైద్యురాలిగా నటించానని చెప్పారు. ఇలాంటి ఇతివృత్తంతో కథలను ఎలా రాస్తారో? అని తానే ఆశ్చర్యపోయనని చెప్పా రు. అద్దె తల్లి విధానం గురించి ఇటీవల పెద్ద చర్చే జరిగిందని, నిజానికి అంత క్లిష్టమైన సమస్య కాదని పేర్కొన్నారు. అయితే ఈ చర్చకు నటి నయనతార, విఘ్నేష్‌ శివన్‌ వంటి సెలబ్రిటీస్‌ కావడంతో పెద్ద వివాదం జరిగిందన్నారు. ఇక యశోద చిత్రం విషయానికొస్తే కథానుగుణంగా తనలో ప్రతినాయకి ఛాయలు కనిపిస్తాయని, చిత్రంలో సమంత మాదిరిగా తాను ఫైట్స్‌ చేయలేదని, అయితే ఆమె పాత్రకు సమాంతరంగా తన పాత్ర ఉంటుందని చెప్పారు.

సమంతకు ఎప్పుడైతే  ఇతరుల సాయం అవసరం అవుతుందో అప్పుడు తన పాత్ర కథలోకి వస్తుందని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది చిత్రం చూసే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పారు. అయితే చిత్రంలో అద్దె తల్లి విధానం రైటా తప్పా అన్నది చర్చించలేదని, సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని చెప్పడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. మంచి కథా పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను వాటిని ఛాలెంజ్‌గా తీసుకుంటానని వరలక్ష్మీశరత్‌కుమార్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు