Varalakshmi Sarathkumar: క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు నటి వరలక్ష్మి చేయూత

6 Mar, 2023 16:11 IST|Sakshi

కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఒకరు. శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్‌ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్‌ అనిపించుకున్నారు. తెరపై విలన్‌గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. తరచూ ఆమె సామాజిక సేవ చేసిన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌లో హాస్పిటల్‌లో వైద్యులు, క్యాన్సర్‌ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్‌ ఆఫ్‌ షేరింగ్‌ పేరుతో శివశక్తి సంకల్ప్‌ బ్యటిఫుల్‌ వరల్డ్‌ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్‌ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే  క్యాన్సర్‌ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు.

చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. కాగా క్యాన్సర్‌ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైకి చెందిన శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్‌కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్‌ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్‌ బాధితులను కాపాడుతున్న సంకల్ప్‌ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్‌ యాత్రతో క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు