ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన నటిపై కేసు నమోదు

11 Aug, 2021 12:13 IST|Sakshi

తమిళ నటి, బిగ్‌ బాస్‌ ఫేం యషిక ఆనంద్‌ ఇటీవల ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె  ఇటీవల కోలుకుని డిశ్చార్జీ అయ్యింది. అయితే యషిక తన స్నేహితురాలు పావని మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మహాబలేశ్యరం వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషిక ఫ్రెండ్‌ పావని అక్కడిక్కడే మృతి చెందగా, యషిక మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఫొటోలు ఇటీవల సోషల్‌ వైరల్‌ వైరల్‌గా మారాయి. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం కోలుకున్న యషిక డిశ్చార్జ్‌ అయిన తరువాత తనకు తెలిసిన ఓ నర్స్‌ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. తన సొంతింటికి వెళ్లితే స్నేహితురాలు పావని జ్ఞాపకాలే గుర్తుకొస్తాయని అందుకే తెలిసిన నర్సు ఇంటికి వెళ్లి అక్కడే చికిత్స, విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పారు. కాగా ఈ ప్రమాదం యషిక ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్లే జరింగిందని గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. చెంగల్పట్టు జిల్లా కానత్తూరు పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 279 (అతి వేగంగా(ర్యాష్‌గా) కారు నడపడం) 304 ఏ (నిర్లక్ష్యంగా కారు నడిపి వ్యక్తి మృతికి కారణం అయినందుకు) వంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంతేగాక పోలీసులు ఆమె డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కాగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా యషిక సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేస్తూ.. పావని మృతిని తలచుకని బాధపడిన సంగతి తెలిసిందే. ‘నేను కూడా చనిపోయుంటే బాగుండేది. ఇప్పుడు బతికున్నా సంతోషంగా లేను. పావని నువ్వు జీవితంలో నన్న క్షమించవని తెలుసు. వీలైతే మళ్లీ మా మధ్యకు రా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది. అంతేగాక దేవుడు తనను బతికించనందుకు సంతోషపడాలో.. తన స్నేహితురాలిని తీసుకెళ్లినందుకు బాధపడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా యషిక ఫుల్‌గా తాగి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మొదట్లో వార్తలు రాగా వాటిపై కూడా ఆమె స్పందించింది. ‘చట్టం అందరికి ఒకేలా ఉంటుంది. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించకపోయిన పర్లేదు, తప్పుడు వార్తలు మాత్రం సృష్టించకండి’ అంటూ నెటిజన్లపై మండిపడింది. కాగా యషిక విజయ్‌ దేవరకొండ ‘నోటా’ సినిమాలో నటించింది.

మరిన్ని వార్తలు