అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు 

23 Nov, 2022 02:27 IST|Sakshi

సినిమా సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్‌. స్పెషల్‌ సాంగ్‌ ఆ మ్యాజిక్‌ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్‌ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండటం కామన్‌ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయనున్న ‘స్పెషల్‌ సాంగ్స్‌’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. 

తెలుగు మాస్‌ ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ  ఊర్వశీ రౌతేలా. ‘భాగ్‌ జానీ’, ‘కాబిల్‌’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్‌ చూడనున్నాం. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకుడు.

ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన స్పెషల్‌ సాంగ్‌లో చిరంజీవితో కలిసి  సూపర్‌ స్పెషల్‌ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.  కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌లో రామ్‌తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి.


ఊర్వశీ రౌతేలా 

ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్‌ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్‌గా నటించిన ‘బ్లాక్‌ రోజ్‌’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్‌ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్‌ క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్‌ స్పెషల్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ను ‘బోళా శంకర్‌’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌.


అప్సరా రాణి 

ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్‌ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్‌ డ్యాన్స్‌ వేశారు.   గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్‌ స్వరపరచిన స్పెషల్‌ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్‌ స్టెప్పులేశారు.


చంద్రికా రవి 

ఈ సినిమా సంక్రాంతికి  రిలీజ్‌ కానుంది. అలాగే రామ్‌ ‘రెడ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన హెబ్బా పటేల్‌ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్‌. ఈ సినిమాకు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీత దర్శకుడు.

ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్‌’లో ‘బూమ్‌ బద్దల్‌’ అంటూ సిల్వర్‌ స్క్రీన్‌ని షేక్‌ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్‌’ చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్‌ సాంగ్‌ చేశారు. సుధీర్‌ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్‌’. మహేశ్‌ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతదర్శకుడు. 

వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్‌ సాంగ్స్‌లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్‌గా నిలిచే ఈ సాంగ్స్‌ అందాల తారల కెరీర్‌లోనూ స్పెషల్‌గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తుంటారు. 

మరిన్ని వార్తలు