బిగ్‌బాస్‌ బ్యూటీతో నితిన్‌ సత్య రీఎంట్రీ

30 Aug, 2022 08:29 IST|Sakshi

తమిళ సినిమా: ద్వారకా ప్రొడక్షన్స్‌ పతాకంపై బ్లేస్‌ కన్నన్, శ్రీలతా బ్లెస్‌ కన్నన్‌ నిర్మిస్తున్న చిత్రం కొడువా. ఈ చిత్రం ద్వారా నటుడు నితిన్‌ సత్య హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సంయుక్త కథానాయకగా నటిస్తున్న ఇందులో మురుగదాస్, సంతాన భారతి, వినోద్‌ సాగర్, సుభద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బ్యాచిలర్‌ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన సురేష్‌ సాతయ్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్రం సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ... కొడువా రామనాథపురం నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పారు. ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించేలా ఉంటుందన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలు, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయన్న ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. దీనికి ధరన్‌ కుమార్‌ సంగీతాన్ని, కార్తీక్‌ నల్లమత్తు ఛాయాగ్రహణంను అందిస్తున్నారని తెలిపారు.

కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకుడు వెంకట్‌ ప్రభు, నిర్మాత ఐన్గరన్‌ కరుణా మూర్తి, సుందర్, దర్శకుడు రాజేష్‌ ఎం.సెల్వా, నటుడు వైభవ్, పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  

మరిన్ని వార్తలు