ఢీలో సంపాదన తక్కువన్న చైతన్య, జబర్దస్త్‌లో అందుకే ఎక్కువంటున్న అభి

4 May, 2023 17:56 IST|Sakshi

ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేసిన చైతన్య మాస్టర్‌ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే! మే 1న అప్పులు తీర్చలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నాడు. ఢీ షో పేరు ఇస్తుంది కానీ జబర్దస్త్‌లో వచ్చినంత సంపాదన ఢీలో రాదని ఆయన వీడియోలో వాపోయాడు. తాజాగా చైతన్య మృతికి సోషల్‌​ మీడియా వేదికగా నివాళులు అర్పించిన కమెడియన్‌ అదిరే అభి జబర్దస్త్‌ వర్సెస్‌ ఢీ పారితోషికాలపై స్పందించాడు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశాడు.

సినిమా, టీవీ పరిశ్రమలో ఉండేవాళ్లను చూసి చాలామంది కొత్తగా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. అలా వచ్చి సెటిలైన వాళ్లను చూసి.. మరింతమంది ఇన్‌స్పైర్‌ అయి వస్తుంటారు. అంటే.. మనం ఏం చేసినా దాని ప్రభావం తర్వాత వచ్చేవాళ్లపై పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీ గురించి ముందు అవగాహన తెచ్చుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం వస్తుంది. ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ పరిచి ఆఫర్లు ఇస్తారు, చాలా డబ్బులు వస్తాయి అని భ్రమపడితే పొరపాటే. కడుపు మాడ్చుకుని, ఎన్నో నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్‌ వస్తుంది. ఒక బ్రేక్‌ వచ్చాక దాన్ని మెయింటెన్‌ చేయడం కూడా చాలా పెద్ద విషయం! 

ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ స్టార్‌గా వెలుగొందిన అమితాబ్‌ బచ్చన్‌ గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్‌లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో వంద కోట్ల మేర నష్టం వచ్చింది. తన కార్లు కూడా అమ్మేసుకున్నాడు. కానీ.. కౌన్‌ బనేగా కరోడ్‌పతితో హోస్ట్‌గా మళ్లీ కెరీర్‌ మొదలుపెట్టి జీరో నుంచి మళ్లీ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. అంటే పరిస్థుతులను ఎదుర్కొనేంత మానసిక ధైర్యం మనకు ఉండాలి. అందుకే ముందుగానే ప్లాన్‌ బి కూడా రెడీ చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు సాయపడుతుంది. చిన్నవాటికే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు.

ఇక షో రేటింగ్‌ను బట్టి ఆయా ప్రోగ్రామ్‌లో పని చేసే వాళ్లకు పారితోషికం ఇస్తారు. జబర్దస్త్‌కు రేటింగ్‌ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తారు. అయినా వాటి మీద ఆధారపడకుండా బయట ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌ ద్వారా ఆర్టిస్టులు మరింత సంపాదిస్తారు. ఇక్కడ ఆఫర్లు రానప్పుడు వేరే దారి ఎంచుకుని జీవించడం బెటర్‌' అని చెప్పుకొచ్చాడు అభి.

చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై ఆన్సరేంటంటే

మరిన్ని వార్తలు