Aditi Rao Hydari: సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు

12 Oct, 2021 05:15 IST|Sakshi

‘‘నాకు చాలెంజింగ్‌ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్‌లా సెట్‌కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్‌ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్‌ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్‌ వర్కింగ్‌.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది.

నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్‌గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్‌లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్‌లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్‌లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే  నాకు డైలాగ్స్‌ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్‌ నంబర్‌ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్‌కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్‌ ప్రాక్టీస్‌ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్‌ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌–బృందా మాస్టర్‌తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు