ఇలానే ఉంటే బైక్‌ అమ్మాల్సిన పరిస్థితి: ఆదిత్య నారాయణ్

15 Oct, 2020 09:40 IST|Sakshi

కరోనా వైరస్‌ మానవాళి జీవితాలను పూర్తిగా తలకిందులు చేసింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. పనులు లేవు.. చేతిలో డబ్బులు లేవు. ఇక లాక్‌డౌన్‌ ఇలానే కొనసాగితే ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, టెలివిజన్‌ హోస్ట్‌ ఆదిత్య నారాయణ్‌. మరి కొద్ది రోజుల్లో ఆయన తన చిరకాల ప్రేయసి శ్వేతా అగర్వాల్‌ని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం లాక్‌డౌన్ను ఇలానే కొనసాగిస్తే, ప్రజలు ఆకలితో మరణించడం ప్రారంభిస్తారు. నా సేవింగ్స్‌ మొత్తం ఖర్చు అయ్యాయి. దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. మనుగడ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను పెట్టిన పెట్టుబడి డబ్బులను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి గురించి ఎవ్వరం ఊహించలేదు కదా’ అన్నారు. (చదవండి: సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!)

‘ఓ ఏడాది పాటు పని చేయకుండా ఉంటామని అనుకోము కదా. ఎవరూ దీనిని ఊహించలేదు.. ప్లాన్ చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో అందరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది.. ఏదో కొందరి బిలియనీర్స్‌ది తప్ప. ప్రస్తుతం నా ఖాతాలో 18 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలో వివాహం చేసుకోబోతున్నాను. ఇక నేను అక్టోబర్ నుంచి పని చేయడం ప్రారంభించకపోతే, నా దగ్గర డబ్బు ఉండదు. అప్పుడు బతకడానికి నా బైక్ లేదా ఏదైనా అమ్మవలసి వస్తుంది. నిజంగా ఇది చాలా కఠినమైన పరిస్థితి. చివరకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఓ వర్గం ప్రజలు ఈ నిర్ణయం తప్పు అని చెప్పి సానుభూతి చూపిస్తారు. సాయం మాత్రం చేయరు’ అన్నారు ఆదిత్య నారాయణ్‌.

మరిన్ని వార్తలు