ఆమెకు వీడ్కోలు.. శ్రద్ధాతో ప్రేమ, చివరకు గుడ్‌బై.. ఆదిత్య రాయ్‌ బ్రేకప్‌ స్టోరీ

8 Aug, 2021 08:00 IST|Sakshi

ఆదిత్య రాయ్‌ కపూర్‌..సినిమా హీరోగా  కన్నా ప్రేమికుడిగానే ఫేమస్‌.  అతని విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’లో...

సిద్ధార్థ రాయ్‌ కపూర్‌ తమ్ముడిగా కాకుండా సొంత గుర్తింపుతోనే రాణిస్తున్నాడు ఆదిత్య రాయ్‌ కపూర్‌. అలాంటి ఐడెంటిటీ, సింప్లిసిటీ తోవలోనే నడుస్తున్న అహానా డియోల్‌ అంటే మనసు పడ్డాడు. అహానా ఎవరంటే.. ధర్మేంద్ర, హేమమాలినిల రెండో కూతురు. అమ్మ, నాన్న ఫేమ్‌తో కాకుండా స్వీయ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం.. ప్రయత్నం ఆమెది. అందుకే సంజయ్‌ లీలాభన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ‘గుజారిష్‌’ సినిమాకు పనిచేయసాగింది. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ది కూడా ముఖ్య భూమిక. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ ఒకటే అవడంతో త్వరగానే స్నేహం కుదిరింది.

‘గుజారిష్‌’ విడుదలయ్యేలోపు ఆ ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. చెట్టపట్టాల్, చాటింగ్, అవుట్‌స్కట్స్‌లో హ్యాంగవుట్స్‌ ఈ లవ్‌ స్టోరీలోనూ షెడ్యూల్‌ అయ్యాయి. ఈ ప్రేమను ఆశీర్వదించే వాళ్లకంటే ఆ జంటను చూసి ఆందోళన చెందిన వాళ్లే ఎక్కువ.. అయ్యో.. చక్కటి కెరీర్‌ను ప్రేమ పాశంతో కట్టేసుకుంటున్నారే అని. అయినా నాలుగేళ్లు ఆ మోహంలో పడి కొట్టుకుపోయారిద్దరూ. అప్పుడు కలగజేసుకున్నారు ఇరువైపు పెద్దలు. పని మీదే దృష్టిపెట్టండని హెచ్చరించారు. లక్ష్యం గుర్తొచ్చింది ఇద్దరికీ. కలల్లోంచి బయటకు వచ్చారు. 

ఇద్దరి గమ్యం ఒకటే అయినా కలిసి చేయాల్సిన ప్రయాణం కాదని అర్థం చేసుకున్నారు. స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పుకున్నారు తమ ప్రేమకు. విడివిడిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. 

ఆ బ్రేకప్‌ తర్వాత.. ఆదిత్య రాయ్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడు. శ్రద్ధా కపూర్‌తో. ‘ఆశికీ 2’ సినిమా సెట్స్‌ మీద. ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి సినిమా అది. ఆ జంట కెమిస్ట్రీకి బాక్సాఫీస్‌ బ్రహ్మరథం పట్టింది. ఆ సినిమా విషాదంతం కావడంతో బాధపడ్డారు. నిజ జీవితంలో ఈ ఇద్దరు జతకూడితే బాగుండు అని ఆశపడ్డారు అభిమానులు. వాళ్లు ఆశించినట్టుగానే మిత భాషి అయిన ఆదిత్యకు గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే శ్రద్ధా అంటే ఇష్టం ఏర్పడింది. అలా ఆమె తన ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే చాలు.. అంతకన్నా జీవితానికింకేం కావాలి అనుకున్నాడు. ఆ మాటే ఆమెతో చెప్పాడు. స్వచ్ఛమైన నవ్వుతో ‘ఓకే’ అంది. ఆ ప్యార్‌ కంటిన్యూ అయింది. లేట్‌ నైట్‌ పార్టీలు.. ఏ కొంచెం టైమ్‌ దొరికినా ఏకాంతవాసాలు.. హాలీడేయింగ్‌లతో కాలాన్ని క్వాలిటీగా మలచుకున్నారు. పెళ్లితో శుభం కార్డ్‌ వేసుకుంటారనే భావించారు బాలీవుడ్‌ జనాలు. 

అయితే.. ‘ఆశికీ 2’ సినిమా స్క్రిప్ట్‌లాగే సాగింది వాళ్ల ప్రేమ కథ. శ్రద్ధా కపూర్‌ నటించిన సినిమాలు సక్సెస్‌ అవడంతో ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ పైకి వెళ్లిపోయింది. ఆదిత్య రాయ్‌ కపూర్‌కు మాత్రం ఇంకా స్ట్రగుల్‌ తప్పలేదు. అతని మనసులో ఎక్కడో ఓడిపోతున్న భావన. తగ్గట్టుగానే శ్రద్ధా తల్లిదండ్రులు ఆమె మీద ఆంక్షలు పెట్టారట.. ఆదిత్యతో చెలిమికి హద్దులు పెట్టుకోమని. శ్రద్ధా లెక్క చేయకపోయినా.. ఆదిత్య గ్రహించాడు. ఏ చలాకితనాన్నయితే జీవితాంతం తోడుగా కావాలనుకున్నాడో ఆ చలాకితనం నుంచి దూరం కోరుకోసాగాడు. ఆమె సక్సెస్‌ అతనిలో ఆత్మన్యూనత పెంచసాగింది. అది అసూయగా మారకముందే ఆ బంధంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆదిత్యను అర్థం చేసుకున్న శ్రద్ధా అతనికి స్పేస్‌ ఇచ్చింది. పక్కకు తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవించింది ఆమె. 
అలా ఇద్దరూ విడిపోయారు. కాని మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. 

అయితే..ఈ జంట తమ ప్రేమ కథను ఎప్పుడూ ఒప్పుకోలేదు. చాలా పత్రికలు.. చానెళ్లు వాళ్ల మధ్య ఉన్న చనువు గురించి ప్రశ్నల వర్షం కురిపించినా బయటపడలేదు. ‘నేను సింగిలే. నా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ మారలేదు. నా దృష్టిలో ప్రేమ ఒక బాధ్యత. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యాకే నచ్చిన మనిషితో కమిట్‌ అవుతా.  ప్రస్తుతానికి నేను, శ్రద్ధా  గుడ్‌ ఫ్రెండ్స్‌మి అంతే’ అని ఆదిత్య రాయ్‌ కపూర్, ‘ఆశికీ 2 సినిమా షూటింగప్పుడు, తర్వాత.. మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. మాకు అంటే నాకు, ఆదిత్యకే కాదు మోహిత్‌ సూరి (దర్శకుడు)కి కూడా. అలా ఆ సినిమా మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చింది. స్నేహం తప్ప మా మధ్య ఇంకేం లేదు. ఆ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకుంటాం’ అని శ్రద్ధా కపూర్‌ చెప్పారు. 
- ఎస్సార్‌

మరిన్ని వార్తలు