దర్శకుడు రాజమౌళిపై ఆదివాసీల ఆగ్రహం

24 Oct, 2020 20:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ వివాదంలో చిక్కుకుంది. గోండుల వీరుడు కొమురం  భీంగా  జునీయర్‌ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ అల్లూరి సీతారామరాజుగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు రాజమౌళి దశలుగా సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ వారిలో మరింత ఆసక్తిని రేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్‌ టీజర్‌ వివాదాస్పదంగా మారింది. కొమురం భీం పాత్ర పోషిస్తున్న తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: వాడి పొగరు ఎగిరే జెండా)

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కొమురం భీం విగ్రహానికి ఆదివాసీల యువసేన ఇవాళ(శనివారం) క్షీరాభిషేకం చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీజర్‌లో ఎన్టీఆర్‌కు ముస్లిం టోపి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అని, ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలంటూ రాజమౌళికి సూచించారు. ఇష్టారీతిగా సినిమా తీసి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీయోద్దంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో ముస్లిం టోపి ఉన్న కొమురం భీం సన్నివేశాలను తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆదివాసీలు హెచ్చరించారు. కాగా, బాహుబలి సినిమా అప్పుడు కూడా పలు వివాదాలు చెలరేగాయి. గిరిజనులను అవమానకరంగా చూపారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి.  (చదవండి: ఆర్ఆర్ఆర్‌ టీజ‌ర్‌: ఇవ‌న్నీ ఇప్ప‌టికే చూసేశాం)

మరిన్ని వార్తలు